ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ప్రస్తుతానికి అమరావతేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని కూడా కేంద్రం తేల్చి చెప్పింది. బుధవారం రాజ్యసభలో ఏపికి చెందిన ఎంపిలు రాష్ట్ర విభజన సమస్యలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.
ఉమ్మడి ఆస్తులపై వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి లేవనెత్తగా, తెలంగాణకు విద్యుత్తు పంపిణీ, శ్రీశైలం డ్యాం నుంచి తెలంగాణ అక్రమంగా నీరు తీసుకోవడం, రాష్ట్ర రాజధాని విషయమై బిజెపి ఎంపిలు టిజి వెంకటేశ్, జివిఎల్ నరసింహారావు, సిఎం రమేష్ ప్రశ్నలు లేవనెత్తారు.
వీటికి కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన తరువాత తెలంగాణకు విద్యుత్తు పంపిణీ చేయగా ఆ మొత్తం సొమ్ము ఏపికి తెలంగాణ కట్టకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. వడ్డీతో కలిపి సుమారు రూ.6వేల కోట్లు ఏపికి తెలంగాణ నుంచి రావాల్సి ఉందని, తెలంగాణకు కేటాయింపుల్లో ఆ మేరకు తగ్గించి ఏపికి ఇవ్వాలని టిజి వెంకటేశ్ కేంద్రాన్ని కోరారు.
నోడల్ ఏజెన్సీగా కేంద్ర హౌంశాఖ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. శ్రీశైలం డ్యాం నుంచి విద్యుదుత్పత్తి, సాగునీరు నిమిత్తం తెలంగాణ ఎక్కువ నీటిని వాడుకుంటోందని, తదుపరి కేటాయింపుల్లో ఆ మేరకు జలాలు తగ్గించాలని టిజి వెంకటేశ్ కేంద్రాన్ని కోరారు.
దీనిపై నిత్యానందరారుయ్ స్పందిస్తూ రెండు రాష్ట్రాల మధ్య సమస్యలకు సంబంధించి ఇప్పటి వరకూ 26 సమావేశాలు నిర్వహించామని, తదుపరి సమావేశంలో దీని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఏపి రాజధాని హైదరాబాద్‌గా కేంద్రం పలుచోట్ల ప్రస్తావిస్తోందని సామాజిక మాధ్యమాల్లో వస్తోందని ఏపి రాజధాని ఏర్పాటుపై నిర్ణయం ఎవరిదంటూ జివిఎల్ నరసింహారావు ప్రశ్నించారు.
విభజన అనంతరం ఏపి ప్రభుత్వం రాజధానిగా అమరావతిగా నిర్ణయిస్తూ కేంద్రానికి తెలిపిందని నిత్యానందరాయ్ తెలిపారు. అనంతరం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేస్తున్నట్లు తీసుకొచ్చిన బిల్లు విరమించుకున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని తెలిపారు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయమని మంత్రి పునరుద్ఘాటించారు. ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయంటూ సిఎం రమేశ్ ప్రశ్నకు సమాధానమిస్తూ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాల అనుమతితో కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని, మిగిలినవి తదుపరి సమావేశంలో పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర హౌంశాఖ సమన్వయకర్తగానే పనిచేస్తుందని నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు.
ఆస్తుల విభజనకు కేంద్రం అనుమతి
కాగా, విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూలులో పేర్కొన్న ఆస్తుల విభజనకు కేంద్రం కమిటీని నియమించినట్లు తెలిపారు. 90 ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య విభజన చేయాలని కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. వీటిలో 68 ఆస్తులకు సంబంధించి తెలంగాణ ఎలాంటి అభ్యంతరం తెలపలేదని, ఆంధ్రప్రదేశ్ 33 సంస్థల విభజనకే అంగీకరించిందని వివరించారు.
ఆస్తుల విభజనకు సమగ్ర పరిష్కారం కావాలని ఏపి కోరుతుండగా, తెలంగాణ కేసుల వారీగా పరిష్కరించాలని కోరుతోందని చెప్పారు. చట్టంలోని పదో షెడ్యూలులో పేర్కొన్న 112 శిక్షణ సంస్థల విభజనకు సెక్షన్ 75 కింద ఎలాంటి విధివిధానాలు ఏర్పరచనందున సమస్య వచ్చిందని పేర్కొన్నారు.
ఈ సంస్థలను జనాభా ప్రాతిపదిక విభజించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోందని, భౌగోళిక విభజన ప్రకారం చేపట్టాలని తెలంగాణ కోరుతోందని చెప్పారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి కేంద్ర హౌం శాఖ సూచనలు ఇస్తుందని చెప్పారు.. ఉభయ రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం, ఆమోదం కుదిరనప్పుడే ఆస్తుల విభజనపై నిర్ణయం తీసుకోవడం సాధ్యం అవుతుందని కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు.