ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ కారుపై గుర్తు తెలియని కొందరు దుండగులు జరిపిన కాల్పులు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ లో కలకలం రేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కిథౌర్‌లో ఈ సంఘటన జరిగింది.
దుండగులు మూడు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. 34 తూటాలు కారు కింది భాగంలోకి దూసుకెళ్లాయి. మీరట్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఒవైసి ఢిల్లీ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. యుపి ఎన్నికలలో ఒవైసి పార్టీ 93 సీట్లలో పోటీ చేస్తుండడంతో ఆయన విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఛజర్సీ టోల్ ప్లాజా సమీపంలో ఆయన వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 34 రౌండ్ల బుల్లెట్స్ దూసుకెళ్లాయి. దాంతో ఆయన వాహణం టైర్లు పంక్చర్ అయ్యాయి. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు, నలుగులు ఉన్నారని, తాను వేరే వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయానని ఒవైసి చెప్పారు. కాల్పుల తర్వాత తుపాకులు ఘటనాస్థలంలో వదిలి దుండగులు పరారైనట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. కారుకు బుల్లెట్లు తగిలిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరట్, కిఠౌర్ ప్రాంతాల్లో ఈ రోజు పాదయాత్ర చేశాం. ప్రచార కార్యక్రమాలను ముగించుకుని ఢిల్లీకి తిరిగి ప్రయాణమయ్యాం. నా కారుతో పాటు ముందు ఒక సఫారీ, వెనుకాల రెండు ఫార్చ్యూనర్లతో వెళ్తున్నాం. ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గరకు రాగానే బారికేడ్ల కారణంగా మా వాహనాలు స్లో అయ్యాయి. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది” అంటూ తర్వాత జరిగిన సంఘటన గురించి ఒవైసి తెలిపారు.
“నా కారు డ్రైవర్ కాల్పులు జరుగుతున్నాయని గ్రహించాడు. వెంటనే మా ముందున్న వాహనాన్ని ఢీకొడుతూ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు. మా కారు ఎడమ వైపు రెండు బుల్లెట్ గుర్తులు ఉన్నాయి. కాల్పులు జరిపినవారిలో ఒకరు ఎరుపు జాకెట్, ఒకరు తెలుపు జాకెట్ ధరించి ఉన్నారు” అని చెప్పారు.
“మా వెనకాల ఉన్న ఫార్చ్యూనర్‌లో ఉన్నవాళ్లు దుండగులపైకి వాహనాన్ని తీసుకెళ్లారు. అందులో ఒకరి కాలుపై నుంచి ఫార్చ్యూనర్ వెళ్లింది. తెలుపు జాకెట్లో ఉన్న వ్యక్తి అక్కణ్ణుంచి పారిపోయాడు. కాసేపటి తర్వాత అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అధికారి ఫోన్ చేశారు” అంటూ కాల్పుల ఘటన గురించి అసదుద్దీన్ ఒవైసీ వివరించారు.
కాల్పులకు పాల్పడినవారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని ఆ అధికారి ఒవైసికి చెప్పారు. యూపీ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరగడం వెనుక కచ్చితంగా రాజకీయ కారణాలున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలకు భయపడేది లేదని, మళ్లీ యూపీలో ప్రచారం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
బులెట్ కారుకు తగలింది కాబట్టి సరిపోయిందని, అదే తన తలకు తాకితే పరిస్థితి ఏంటని ఒవైసి ప్రశ్నించారు. ఇలాంటి బెదిరింపులకు తాను లొంగనని స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, ఘటనకు కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. తాను 1994 నుంచి ప్రజా జీవితంలోనే ఉన్నానని, ఎప్పుడూ సెక్యూరిటీ అడగలేదని చెప్పారు.
కొన్ని రోజులుగా వెంటాడుతున్న నిందితులు
ఒవైసీపై దాడి చేసిన నిందితులు గత కొన్ని రోజులుగా ఆయన్ను వెంటాడారని పోలీసుల దర్యాప్తులో తేలింది.సభలు, ర్యాలీల్లో అసదుద్దీన్ చేసిన ప్రసంగాలతో విసిగిపోయిన నిందితులు సచిన్, శుభంలు ఒవైసీపై దాడి చేశారని పోలీసులు చెప్పారు.
నిందితులు మీరట్ ర్యాలీతో పాటు గతంలో ఒవైసీ పాల్గొన్న పలు బహిరంగ సభలకు హాజరై, దాడికి పథకం పన్నారని సమాచారం. ఒవైసీపై దాడి చేసిన నిందితులు మీరట్ ర్యాలీలో పాల్గొన్నారనే సమాచారంతో పోలీసులు ర్యాలీకి సంబంధించిన సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.
నిందితులిద్దరూ గత కొన్ని రోజులుగా ఒవైసీని వెంబడిస్తున్నారని, అయితే ఆయనపై దాడి చేసే అవకాశం రాలేదని పోలీసులు చెప్పారు. మీరట్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఒవైసీ వాహనం టోల్ గేటు వద్ద ఆగింది. అవకాశం చూసి నిందితులు ఒవైసీ వాహనంపై కాల్పులు జరిపారు.
నిందితులు సచిన్, శుభంలు సైద్ధాంతికంగా తీవ్రవాద స్వభావం ఉన్నవారని పోలీసు అధికారులు చెప్పారు. నిందితుల్లో ఒకరైన సచిన్ మజ్లిస్ నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అతని సోదరుడు అక్బరుద్దీన్ ప్రసంగాలపై చాలా కోపంగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.
సచిన్ కొద్ది రోజుల క్రితమే కంట్రీ మేడ్ పిస్టల్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సచిన్ కు ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఒవైసీపై కాల్పులు జరిపిన తర్వాత నిందితులిద్దరూ గుంపు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తనపై జరిగిన కాల్పుల ఘటన అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తుతానని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. తనపై జరిగిన దాడి గురించి ప్రస్థావించేందుకు తనకు సమయం కేటాయించాలని అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం లోక్‌సభ స్పీకరును కలిసి కోరనున్నారు.
ఒవైసీపై దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా తమ మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రదర్శనలు చేస్తామని ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ చెప్పారు.అసదుద్దీన్ ఒవైసీపై జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐఎంఐఎం సభ్యులు ఆయా నగరాల పోలీసు కమీషనర్లకు మెమోరాండం సమర్పించనున్నట్టు ఎంపీ తెలిపారు.
ఏఐఎంఐఎం అధినేతపై జరిగిన దాడులను నిరసిస్తూ హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద నల్లజెండాను ఎగురవేశారు.చార్మినార్ వద్ద దుకాణ యజమానులు నిరసన చిహ్నంగా తమ దుకాణాలను మూసివేశారు.యూపీలో ఏఐఎంఐఎం చీఫ్‌పై దాడి జరిగిన తర్వాత హైదరాబాద్‌లోని సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గస్తీని ముమ్మరం చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.హైదరాబాద్ పాతబస్తీలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది.