రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏటా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అద్భుతంగా తీర్చిదిద్దిన శకటాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను కూడా ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో ఉత్తమ రాష్ట్ర శకటంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అవార్డు గెలుచుకుంది.
పాపులర్ చాయిస్ కేటగిరీలో మహారాష్ట్ర శకటం టాప్‌లో నిలిచింది. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు 12 రాష్ట్రాల శకటాలకు మాత్రమే అర్హత లభించింది. ‘‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, కాశీ విశ్వనాథ్ ధామ్” థీమ్‌తో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న యూపీ శకటాన్ని స్టేట్ కేటగిరీలో ఉత్తమ శకటంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
హస్త కళల థీమ్‌తో శకటం రూపొందించిన కర్ణాటక రెండో స్థానంలో నిలవగా, ‘‘రాష్ట్ర స్వర్ణోత్సవాలు, మహిళా సహకార సంఘాలు, స్వయం సహాయక గ్రూప్‌ల’’ థీమ్‌తో శకటం రూపొందించిన మేఘాలయకు మూడో స్థానం దక్కింది. మోస్ట్ పాపులర్ చాయిస్ కేటగిరీలో బయో డైవర్సిటీ థీమ్‌తో శకటం రూపొందించిన మహారాష్ట్ర టాప్ ప్లేస్‌లో నిలిచింది.
ఈ కేటగిరీలోనూ యూపీ రెండో స్థానాన్ని కైవసం చేసుకోగా, జమ్ము కశ్మీర్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాల్లో రెండు డిపార్ట్మెంట్లకు కలిపి ఉమ్మడిగా ఉత్తమ విజేతగా కేంద్రం ప్రకటించింది.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ థీమ్‌తో విద్యా శాఖ రూపొందించిన శకటానికి, ‘‘ఉడాన్ స్కీమ్‌లో భాగంగా చేపట్టిన బుద్ధిస్ట్ సర్క్యూట్, ఏవియేషన్ సెక్టార్లో మహిళల పాత్ర” అన్న థీమ్‌తో రూపుదిద్దుకున్న పౌర విమానయాన శాఖ శకటానికి కలిపి కేంద్రం జాయింట్‌గా బెస్ట్ విన్నర్ అవార్డును ప్రకటించింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో విమానయాన శాఖ శకటాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం.