వాతావరణ మార్పులకు తట్టుకునే సరికొత్త వంగడాలను సృష్టించాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ శాస్త్రవేత్తలకు పిలుపిచ్చారు. పటాన్‌చెరులోని ఇక్రిశాట్ సంస్థ స్వర్ణోత్సవాలలో పాల్గొంటూఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్‌ను ఆయన ఆవిష్కరించారు.
వచ్చే 25 ఏళ్లలో చేసే కార్యక్రమాలపై లక్ష్యం నిర్దేశించుకోవాలని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలకు ప్రధాని సూచించారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలని ఆకాంక్షించారు.
వసంతపంచమి రోజు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని చెబుతూ టెక్నాలజీని మార్కెట్ తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్ ఎంతో కృషి చేస్తుందని ప్రధాని కొనియాడారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్ వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారని, నీరు, మట్టి మేనేజ్ మెంట్ పై అద్భుతమైన పరిశోదనలు చేశారని ప్రధాని ప్రశంసించారు. దేశంలోని 170 జిల్లాల్లో కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయని చెబుతూ అక్కడ సాగు పద్దతులపై మరింతగా పరిశోధనలు జరగాల్సి ఉందని ప్రధాని సూచించారు.
దేశంలో డిజిటల్ అగ్రికల్చర్ పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని చెబుతూ, దీంతో సాగు రంగంలో పెనుమార్పులు సంభవిస్తాయని తెలిపారు.పంటకాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలని ఆయన కోరారు. తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదం చేయాలని పేర్కొన్నారు.
వ్యవసాయంలో డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక అభివఅద్ధి మరింతగా జరగాల్సి ఉందని పేర్కొంటూ, సేంద్రియ సాగుపై రైతులు మరింత దృష్టి సారించాలని సూచించారు. సాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లోనూ పంట దిగుబడులు పెరిగేలా చూడాలని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆదా చేసుకోవాలని వివరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పంట దిగుబడి గణనీయంగా ఉందన్న ప్రధాని మోదీ.. చిన్న రైతుల సాగు వ్యయాన్ని తగ్గించాలని చెప్పారు. దేశంలోని 80% కంటే ఎక్కువ చిన్న రైతులపై తమ ప్రభుత్వ దృష్టి ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ 2022-23 సహజ వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై దృష్టి పెట్టిందని ప్రధాని గుర్తు చేశారు.
దేశంలో వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించబోతున్నామని ప్రధాని వెల్లడించారు. పామాయిల్ సాగుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ సాగును మరింత ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఆహార భద్రత సాధించామని, దేశంలో మిగులు ధాన్యాలు ఉన్నాయని వెల్లడించారు. డిజిటల్ వ్యవసాయాన్ని విస్తరించేందుకు ప్రయివేటు అగ్రిటెక్ల సహకారం తీసుకుంటామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ జీవన విధానం కావాలని మోదీ ఆకాంక్షించారు. కర్బన ఉద్గారాలను తగ్గించటానికి చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. పచ్చని భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
రాబోయే కొన్నేళ్లలో పామాయిల్ రంగంలో ఏరియా వినియోగాన్ని 6.5 లక్షల హెక్టార్లకు తీసుకెళ్లాలనుకుంటున్నామని ప్రధాని వెల్లడించారు. ఆహార భద్రతతో పాటు పోషకాహార భద్రతపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తాము గత 7 సంవత్సరాలలో అనేక బయో-ఫోర్టిఫైడ్ రకాలను అభివృద్ధి చేశామని ప్రధాని మోదీ వివరించారు.