అండర్–19 వరల్డ్‌కప్‌లో యంగ్ ఇండియా ఖతర్నాక్ ఆటతో చెలరేగిపోయింది. లీగ్ దశలో చూపెట్టిన సూపర్ పెర్ఫామెన్స్‌ను టైటిల్ ఫైట్‌లోనూ కంటిన్యూ చేసింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఇండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
ఫలితంగా ఐదోసారి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్44.5 ఓవర్లలో 189 రన్స్‌కు ఆలౌటైంది. జేమ్స్ రెవ్ (116 బాల్స్‌లో 12 ఫోర్లతో 95), జేమ్స్ సేల్స్ (34 నాటౌట్) రాణించారు. తర్వాత ఇండియా 47.4 ఓవర్లలో 6 వికెట్లకు 195 రన్స్ చేసి నెగ్గింది. రాజ్‌బవాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
మోస్తరు టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఇండియాకు సెకండ్ బాల్కే ఎదురుదెబ్బ తగిలింది. స్కోరు బోర్డు మీద ఒక్క రన్ కూడా రాకుండానే ఓపెనర్ రఘువన్షి (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇక్కడి నుంచి హర్నూర్ సింగ్ (21), షేక్ రషీద్ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. సింగిల్స్, డబుల్స్‌తో ముందుకెళ్లారు.
అయితే 18వ ఓవర్లో అస్పిన్‌వాల్ బాల్‌ను వదిలేసే క్రమంలో హర్నూర్ సింగ్ అనవసరంగా ఔటయ్యాడు. దీంతో సెకండ్ వికెట్‌కు 49 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఇక కొత్తగా వచ్చిన కెప్టెన్ యశ్ ధూల్ (17), రషీద్‌తో కలిసి నిలకడగా ఆడేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో రషీద్ 83 బాల్స్‌లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అయితే నెక్స్ట్ మూడు ఓవర్లలో ఇండియాకు ఊహించని ఝలక్ తగిలింది. 27వ ఓవర్ లాస్ట్ బాల్‌కు రషీద్, ఆ వెంటనే యష్ ధూల్ ఔటయ్యారు. దీంతో ఇండియా స్కోరు 97/4గా మారింది. ఈ దశలో నిషాంత్ సింధు, రాజ్ బవా ఆచితూచి ఆడారు.
ఇంగ్లిష్ బౌలర్లు పట్టుబిగించడంతో.. ఈ ఇద్దరు సింగిల్స్‌కే పరిమితమయ్యారు. దాదాపు 10 ఓవర్ల పాటు మెల్లగా ఆడటంతో ఓ దశలో రన్‌రేట్ మందగించింది. అయితే 40వ ఓవర్ లాస్ట్ బాల్, ఆ తర్వాతి ఓవర్ ఫస్ట్‌బాల్‌కు చెరో సిక్స్ కొట్టి ప్రెజర్‌ను తగ్గించుకున్నారు.
ఇక సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు 43వ ఓవర్లో బోయెడెన్ షాకిచ్చాడు. నిలకడగా ఆడుతున్న బవాను.. ఓ లెంగ్త్ బాల్‌తో ఔట్ చేశాడు. దీంతో ఐదో వికెట్‌కు 67 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. ఇక ఇండియా గెలవాలంటే 42 బాల్స్‌లో 26 రన్స్ కావాల్సిన దశలో నిషాంత్, కౌశల్ తాంబే (1) మెల్లగా ఆడారు.
అయితే 47వ ఓవర్లోతాంబేను ఔట్ చేయడంతో విక్టరీ ఈక్వేషన్ 22 బాల్స్‌లో 14గా మారింది. ఈ క్రమంలో ఫోర్ కొట్టిన నిషాంత్ 54 బాల్స్‌లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. వెంటనే దినేశ్ బనా (13 నాటౌట్) రెండు సిక్సర్లతో ఇండియాను గెలిపించిండు.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు సరైన ఆరంభం లభించలేదు. పిచ్‌పై తేమను సద్వినియోగం చేసుకున్న ఇండియా పేసర్ రాజ్ బవా.. ఇంగ్లిష్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.అతనికి రవి కుమార్ అండగా నిలవడంతో.. ఓ దశలో ఇంగ్లిష్ టీమ్ వంద రన్స్ చేయడం కూడా కష్టంగా మారింది.
స్టార్టింగ్‌లో సూపర్ స్పెల్‌తో చెలరేగిన బవా.. అపోనెంట్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఓపెనర్లలో థామస్ (27) కాసేపు నిలిచినా.. సెకండ్ ఎండ్‌లో బెతెల్ (2), టామ్ ప్రీస్ట్ (0) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ టైమ్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జేమ్స్ రెవ్ ఒంటరి పోరాటం చేశాడు.
అయితే 13వ ఓవర్లో బవా.. వరుస బాల్స్‌లో లక్స్టన్ (4), జార్జ్ బెల్ (0)ను పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత వరుస ఓవర్లలో రెహన్ అహ్మద్ (10), అలెక్స్ హోర్టన్ (10)ను ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 91 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఎనిమిదో ప్లేస్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జేమ్స్ సేల్స్.. రెవ్‌కు అండగా నిలిచాడు.
దాదాపు 19 ఓవర్లకు పైగా నిలకడగా ఆడిన ఈ జోడీ ఎనిమిదో వికెట్‌కు 93 రన్స్ జోడించడంతో ఇంగ్లండ్ మళ్లీ రేస్‌లోకి వచ్చింది. రవి వేసిన 44వ ఓవర్లో తాంబే సూపర్ క్యాచ్‌కు ఔటైన రెవ్ కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరో రెండు బాల్స్ తర్వాత రవి.. థామస్ (0)ను ఔట్ చేయగా, బవా.. బోయెడెన్ (1)ను పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.