సమాజ్వాదీ పార్టీ “బుజ్జగించే రాజకీయాలు”కు పెట్టింది పేరుకాగా, గాల్వాన్ ఘర్షణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ నాయకుడు చైనా మీడియాను మాత్రమే నమ్ముతాడని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధ్వజమెత్తారు.
ఉత్తర ప్రదేశ్ లోని బల్దియో అసెంబ్లీ నియోజకవర్గంలోని ఫరా పట్టణంలో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పురాణ్ ప్రకాశ్ ప్రచారం సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాజకీయాలు మతానికి అతీతంగా ఉండాలని హితవు చెప్పారు.
‘రాజకీయ ప్రాథమిక ఉద్దేశం ప్రభుత్వాన్ని నడపడం మాత్రమే కాదు, సమాజం, దేశ సంక్షేమం కోసం పనిచేయడం’ అని పేర్కొన్నారు, విభజన రాజకీయాలను బిజెపి ఎప్పటికీ అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు.
సమాజ్వాదీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని, రాజకీయాలు కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమే తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే జరగాలని, కులం, మతాల ఆధారంగా రాజకీయాలు చేయరాదని హితవు చెప్పారు. ఎస్పీ మతం, కులాల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు.
యూపీ పురోగతితోనే నవ భారత అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతూ బీజేపీ ఒక్కటే యూపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ చైనా మీడియాను విశ్వసిస్తున్నారని, భారత సైనికుల పరాక్రమాన్ని కాదని సింగ్ ఆరోపించారు. “గాల్వాన్లో ముగ్గురు-నాలుగు మంది చైనా సైనికులు మరణించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అతను చైనా మీడియాను విశ్వసిస్తున్నాడు. ఆస్ట్రేలియా మీడియా ప్రకారం, 38 నుండి 50 మంది చైనా సైనికులు మరణించారు. కానీ కాంగ్రెస్ నాయకుడికి మన ఆర్మీ జవాన్ల పరాక్రమంపై నమ్మకం లేదు” అంటూ ఎద్దేవా చేశారు.
జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడం గురించి 1951 ఎన్నికల మ్యానిఫెస్టోలో జన్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఎలా ప్రస్తావించారో కూడా సింగ్ ప్రస్తావించారు. ఇప్పుడు ముఖర్జీ కలను ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేశారని కొనియాడారు.
ఢిల్లీ నుంచి పంపిన రూపాయిలో కేవలం 15 శాతం మాత్రమే గ్రామానికి చేరిందన్న రాజీవ్ గాంధీ వ్యాఖ్యను ఆయన ప్రస్తావిస్తూ, మోదీ పరిపాలనా సామర్థ్యం వల్ల ఇప్పుడు వంద శాతం వినియోగిస్తున్నారని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇప్పుడు వంద శాతం లభిస్తుందని, కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన కూలీలు, పేదలకు నెలకు రెండుసార్లు ఉచిత రేషన్ అందిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు.
ఎంఎస్పి ఆపరేషన్ల కింద గోధుమలు, వరి సేకరణకు ప్రభుత్వం రూ. 2.37 లక్షల కోట్లు చెల్లిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం రైతుల పట్ల కేంద్రానికి ఉన్న శ్రద్ధకు నిదర్శనమని సింగ్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడంలో మోదీ నాయకత్వాన్ని కొనియాడారు.
పుల్వామా ఘటన తర్వాత పాకిస్థాన్లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినందుకు భారత సైన్యాన్ని ప్రశంసించిన ఆయన, భారతదేశాన్ని తేలికగా తీసుకోలేరని ఇది నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయడాన్ని కూడా సింగ్ ప్రస్తావిస్తూ ఉత్తరప్రదేశ్లో మెరుగైన శాంతిభద్రతల పరిస్థితి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కారణమని రక్షణ మంత్రి పేర్కొన్నారు.
అమెరికాతో సహా అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశం కరోనా మహమ్మారిని బాగా ఎదుర్కొన్నదని చెబుతూ కరోనా మహమ్మారి ఎదుర్కొంటున్న సవాళ్లతో భారతదేశం వ్యవహరించిన విధానం అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో కూడా సాటిలేనిదని స్పష్టం చేశారు. భారతదేశం తక్కువ వ్యవధిలో చేయగలిగిన వేగంతో మరే ఇతర దేశం తన పౌరులకు టీకాలు వేయలేదని గుర్తు చేశారు.