కాంగ్రెస్ ను ఏ రాష్ట్రం కూడా స్వీకరించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుందని, కానీ అక్కడి ప్రజలు ఆ పార్టీ ఓటు వేయలేదని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మరో వందేళ్ల వరకూ అధికారంలోకి రావొద్దని కోరుకుంటున్నట్లుగా ఉందంటూ చురకలేశారు.
రెండేళ్లుగా భారత్ కోవిడ్‌పై పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు గర్వం, అహంకారం తగ్గలేదన్నారు. ఎన్ని ఓటములు ఎదురైనా కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదన్నారు.
లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ హస్తం పార్టీ నేతలు ఇంకా 2014లో ఉన్నారని.. వారు ఏంటనేది ప్రజలు ఇప్పటికే గుర్తించారని అంటూ కాంగ్రెస్ విధానాల్లో సమస్య ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించు అనే విధానం అవలంబిస్తుందని, ఆ పార్టీ టుక్డే టుక్డే గ్యాంగ్‌కు నాయకత్వంగా ఎదిగిందని మోదీ విమర్శించారు.
కాంగ్రెస్ ను విమర్శిస్తూ ఆయన ఓ కవిత చెప్పారు. ‘వారు పగలును రాత్రి అని చెబితే వెంటనే ఒప్పేసుకో. ఒకవేళ నువ్వు ఒప్పుకోకుంటే.. వాళ్లు పగటిపూటే ముసుగు వేసుకుంటారు. అవసరమైతే వాస్తవికతనూ మార్చేస్తారు. వాళ్లకు పొగరు ఎక్కువ. వాళ్లకు తెలిసిందే అనంతం అనుకుంటారు. వాళ్లకు అద్దం చూపిస్తే.. దాన్నీ విరగ్గొట్టేస్తారు’ అని మోడీ కవిత చదివి వినిపించారు.
‘‘తమిళనాడు ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గాయపర్చింది. వాళ్లు ఈ దేశాన్ని విభజించి పాలించాలని చూస్తారు. కానీ నేను తమిళనాడు ప్రజలకు సెల్యూట్ చేస్తున్నాను. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ చనిపోయినప్పుడు వాళ్లు చూపించిన ఐక్యత దేశ ఐక్యతకు మార్గ సూచికంగా కనిపించింది. రావత్ కోసం వారు వీధుల్లో క్యూలు కట్టడం దేశ పట్ల వారికున్న నిబద్ధను చూపిస్తుంది. కానీ కాంగ్రెస్ దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తోంది. విభజించి పాలించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది’’ అని మోదీ మండిపడ్డారు.
లోక్‌సభలో రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని మోదీ ఊటంకిస్తూ ‘‘కొందరు మాట్లాడి వెళ్లిపోతారు. వారి కోసం ఇంకొందరు ఇక్కడ ఉండాల్సి వస్తుంది’’ అని లోక్‌సభా కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరివైపు చూస్తూ ఎద్దేవా చేశారు.
కరోనా తర్వాత దూసుకెళ్తున్న భారత్
కరోనా తర్వాత కొత్త సంకల్పంతో భారత్ దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో ఆయన మాట్లాడుతూ పేదల ఇళ్లలో వెలుగులు నింపితే.. అది మొత్తం దేశంలో స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండటం స్టేటస్ సింబర్ గా మారిన దేశంలో.. ప్రతి పేదోడి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఇవ్వడాన్ని మించిన ఆనందం ఇంకేం ఉంటుందని ప్రశ్నించారు.
‘పేదలకు బ్యాంకు ఖాతాలు తెరవడం ద్వారా పలు ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డబ్బు నేరుగా వారి ఖాతాల్లో పడుతోంది. పేదలు తమ ఫోన్ తో బ్యాంకింగ్ చేస్తున్నారు’ అని ప్రధాని గుర్తు చేశారు. ఇవన్నీ భూమితో అనుబంధం, ప్రజలతో సంబంధాలు ఉన్నవారికే ఇవి కనిపిస్తాయని అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
కాగా, ప్రధాని వాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరంతెలపగా, విపక్షాలు మాట్లాడిన దానిపై సమాధానం చెప్పే హక్కు తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు. పవిత్రమైన పార్లమెంట్ ను ప్రజల కోసం ఉపయోగించాని.. కానీ కొన్ని దళాల ప్రయోజనాలకు దీన్ని వినియోగిస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు.
అలాంటి వాటిని తాము సహించబోమని.. దీటుగా బదులిస్తామని తేల్చి చెప్పారు. అయితే కాంగ్రెస్ సభ్యులు ఈ విమర్శలపై అభ్యంతరం తెలపడంతో సభలో గందరగోళం నెలకొంది. దేశానికి అన్నం పెట్టే రైతులపై రాజకీయం చేసే హక్కు ఎవరికీ లేదని ప్రధాని స్పష్టం చేశారు.
ఈ దేశ బలం చిన్న, సన్నకారు రైతులని వారిని బలవంతులను చేయాల్సిన అవసవరం ఉందని చెబుతూ అయితే కొందరు వీరిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. వారి బాధను అర్థం చేసుకోవడం లేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.