చెప్పుకోదగిన ప్రాబల్యం లేకపోయినా ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ నేత అసదుద్దీన్ ఒవైసి సుమారు 100 స్థానాలలో అభ్యర్థులను పోటీకి దింపుతూ ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకతతో ఈ సారి అధికారంలోకి రాగలమని ధీమాగా ఉన్న సమాజావాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు చుక్కలు చూపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
గత ఏడాది బీహార్ ఎన్నికలలో సహితం పెద్ద ఎత్తున ఒవైసి అభ్యర్థులను నిలబెట్టి, ఐదు స్థానాలను గెల్చుకోవడం తెలిసిందే. ఒవైసి ఎన్నికల రంగంలో ఉండడంతో అక్కడ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా ఆర్ జె డి అధినేత తేజస్వి యాదవ్ కు అధికారం దూరమైనది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో కూడా అదే జరిగే అవకాశమున్నదని ఎస్పీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో అంతకు ముందెన్నడూ లేకపోవడంతో ఒవైసి చతికలబడినా, యుపిలో 2017లో కూడా పొటీ, చేయడం, అప్పటి నుండి రాష్ట్రంలో తరచూ పర్యటనలు జరుపుతూ వస్తుండడం గమనార్హం.
ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి పరోక్షంగా సహకరించబోతున్నట్లు ఇప్పటికే సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో యువతకు గేలం వేసి.. వారిని ఒవైసీ తన వైపు తిప్పుకొంటున్నారని అఖిలేశ్ యాదవ్ విమర్శిస్తున్నారు.
బీజేపీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. తాజాగా ఒవైసీపై జరిగిన కాల్పుల ఘటనతో ఆయనకు సానుభూతి ఓట్లు పెరిగి తమ విజయానికి గండి కొడతారేమోనని అఖిలేశ్ కలవరపడుతున్నారు.
ఎన్నికల కోసం ఒవైసీ ఈసారి చాలా ముందే రంగంలోకి దిగారు. సొంతగా రాజకీయ ఆధిపత్యం సాధించాలని ఆయన ముస్లింలకు పిలుపిస్తున్నారు. అఖిలేశ్‌కు అండగా ఉన్న ముస్లిం-యాదవ్ కూటమి నుంచి బయటపడాలని పరోక్షంగాప్రోత్సహిస్తున్నారు.ఇప్పటివరకు 65 చోట్ల ఒవైసీ తన అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో ఎనిమిది మంది హిందువులు.
ఒవైసీకి బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సహకరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ దఫా చాపకింద నీరులా దళిత-ముస్లిం అంటూ కొత్త సామాజిక సమీకరణను ఆమె తెరపైకి తెచ్చారు. ఇది ఒవైసీ నినాదమైన ‘జై భీమ్,. జై మీమ్’కు దగ్గరగా ఉంది.
బీఎస్పీ ఇంతవరకు 220 మంది అభ్యర్థులను ప్రకటించగా.. వీరిలో 85 మంది ముస్లింలే ఉన్నారు. ఎంఐఎం, బీఎస్పీ వేర్వేరుగా పోటీచేస్తున్నా.. వారి నుంచి పాలకపక్షమైన బీజేపీ కంటే ఎస్పీ నేతృత్వంలోని విపక్ష కూటమికే ఎక్కువ ముప్పని పరిశీలకులు భావిస్తున్నారు.