అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ తెలంగాణలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష రాజకీయ పోరాటం ప్రారంభమైన్నట్లు కనిపిస్తున్నది. కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ మీడియా సమావేశంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరుకొంటున్నది.
ఒక వంక రాజ్యాంగం మార్చివేయాలని కేసీఆర్ కోరడంతో రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ ను అవమానించడంగా భావిస్తూ బీజేపీ కేసీఆర్ ను `దళిత వ్యతిరేకి’ అంటూ ప్రచారాన్ని తీవ్రతరం చేస్తుంటే, మరోవంక శనివారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉండడం ద్వారా గతంలో చెప్పినట్లు బిఎజిపితో `తాడో – పేడో’ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు కేసీఆర్ సంకేతం ఇస్తున్నారు.
ప్రధాని పర్యటనకు కేసీఆర్ గైరాజరు కావడం పట్ల రాష్ట్ర బిజెపి నాయకులు తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంను మార్చాలనడంతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పట్ల దూషణపూరితంగా మాట్లాడటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ `రాజద్రోహం’ కేసు నమోదు చేయాలనీ కోరుతూ హైకోర్టు ను ఆశ్రయించనున్నట్లు బిజెపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ప్రకటించారు.
ఇక ప్రధాని పర్యటన తర్వాత టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే పనిగా ట్వీట్లు చేయడంతో రెండు పార్టీల మధ్య సామజిక మాధ్యమాలలో పోరాటం అదుపు తప్పుతున్నది. పరస్పరం తీవ్ర దూషణలకు దిగుతున్నారు. టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ‘ఈక్వాలిటీ ఆఫ్ తెలంగాణ’ పేరుతో విమర్శలు గుప్పిస్తుండగా, బీజేపీ నేతలు లైవ్‌లోకి వచ్చి ముప్పేట దండయాత్ర చేస్తున్నారు.
వివక్షకు చిహ్నం లాంటి వ్యక్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆవిష్కరించడం చూస్తుంటే వ్యంగ్యం కూడా కొన్ని కోట్ల సార్లు చచ్చిపోతుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం రెండు పార్టీల మధ్య మతాల పోరును పతాక స్థాయికి తీసుకు వెళ్లిన్నట్లయింది. ‘ఐకాన్ ఆఫ్ పార్షియాలిటీ అన్వీల్డ్’ (వివక్షకు చిహ్నం ఆవిష్కృతమైంది) అంటూ ఎద్దేవా చేశారు.
‘తెలంగాణకు నిధుల మంజూరు విషయంలో వివక్షను ఇప్పటికైనా వీడండి ప్రధాని గారు’ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్వీట్ చేశారు. మరో మంత్రి జగదీశ్ రెడ్డి.. ‘తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మోడల్ స్టేట్‌గా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే నాలుగో అతిపెద్ద రాష్ట్రం. కానీ నిధుల మంజూరులో కేంద్రం వివక్ష చూపుతోంది” అని పేర్కొన్నారు.
‘‘తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు అడిగితే ఎవ్వరికీ ఇవ్వట్లేదన్నారు. మధ్యప్రదేశ్‌కూ ఇచ్చారు. కర్నాటకలో అప్పర్ భద్రకు ఇచ్చారు. మరి పాలమూరు సంగతేంటి ప్రధాని గారు?” అని మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ట్వీట్లో రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, దురదృష్ట వశాత్తు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేడం లేదని పేర్కొన్నారు.
‘‘విభజన చట్టంలో హామీలను అమలు చేయకుండా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నది. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి పట్టించుకోండి ప్రధాని గారు” అంటూ గంగుల కమలాకర్ ట్వీట్ చేశారు. అనేక రాష్ట్రాలకు విద్యా సంస్థలు ఇచ్చి, తెలంగాణకు మొండి చెయ్యి చూపుతున్నారని మంత్రి సబిత ట్వీట్ చేశారు.
‘‘ప్రధాని సార్, ఎప్పుడూ టీమ్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకునే మీరు తెలంగాణ విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ ‘బర్నాల్ మూమెంట్’ అంటూ చురక అంటించారు.
దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముంది? అంటూ కేసీఆర్‌ను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. మీరు కోరినప్పుడల్లా ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్ కే పరిమితమవుతారా? అంటూ నిలదీశారు.
రాష్ట్రానికి ప్రధాని వస్తే ప్రొటోకాల్ ప్రకారం సీఎం హోదాలో అటెండవుతానని, అందులో అనుమానం ఎందుకని మొన్న ప్రెస్మీట్లో చెప్పిన కేసీఆర్.. తీరా ప్రధాని పర్యటన సమయంలో మాత్రం దూరంగా ఉండటం, అసలు కారణమేమిటో సీఎంవో నుంచి కూడా అధికారికంగా ప్రకటన విడుదల కాకపోవడం గమనిస్తే రాజకీయ కుతంత్రంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు భావించవలసి వస్తున్నది.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగే అవినీతి బయటకు రావొద్దనే ఉద్దేశంతో.. ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనే వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఆర్ చేసిన వ్యాఖ్యలపై మేధావులు, న్యాయవాదులు, విద్యావేత్తలు స్పందించాలని ఆయన కోరారు.