కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో హిజాబ్ వివాదం పెరిగి పెద్ద నిరసనలు వెల్లువెత్తడంతో విద్యార్థులు, ప్రజలు శాంతి, ప్రశాంతతను కాపాడాలని కర్ణాటక హైకోర్టు విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగంపై విశ్వాసం ఉంచాలని ప్రజలను కోరిన జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షితో, కొంతమంది దుర్మార్గులు మాత్రమే సమస్యను రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆందోళనలు, నినాదాలు, విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడం మంచిది కాదని జస్టిస్ దీక్షిత్ సూచించారు. తీరప్రాంత పట్టణమైన ఉడిపిలోని బాలికల ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన తర్వాత, కోర్టు ఈ విషయాన్ని బుధవారానికి వాయిదా వేసింది. .
“ఈ కోర్టు విద్యార్థులు, ప్రజలను శాంతి, ప్రశాంతతను కాపాడాలని అభ్యర్థిస్తోంది. ఈ కోర్టు ప్రజల వివేకం, వివక్షత లపై పూర్తి విశ్వాసం కలిగి ఉంది. అదే ఆచరణలో పెట్టగలరని ఆశిస్తున్నాము” అని జస్టిస్ దీక్షిత్ సింగిల్ బెంచ్ పేర్కొంది. .
కాలేజీ ప్రాంగణంలో ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం హిజాబ్ ధరించడంతోపాటు అవసరమైన మతపరమైన ఆచారాలను పాటించే ప్రాథమిక హక్కు తమకు ఉందని పిటిషనర్లు కోర్టును కోరారు. మంగళవారం అంతకుముందు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లోని కళాశాలల్లో ‘హిజాబ్’కు వ్యతిరేకంగా , అనుకూలంగా నిరసనలు తీవ్రం అయ్యాయి.
దానితో, మూడు రోజులపాటు రాష్ట్రంలో విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూ, పోలీసు బలగాలను ఉపయోగించుకోవడానికి ఎవరూ అవకాశం ఇవ్వకూడదని హెచ్చరించారు.
ఉడిపి, శివమొగ్గ, బాగల్కోట్ తదితర ప్రాంతాల్లోని కొన్ని విద్యాసంస్థల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఉడిపిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజీలో మంగళవారం నిరసనలు చెలరేగాయి.
హిజాబ్ ధరించిన ముస్లిం యువతులు “న్యాయం చేయాలని” డిమాండ్ చేస్తూ నిరసన చేస్తుండగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు కాషాయ రంగు కండువాలు ధరించి కళాశాల క్యాంపస్‌లో నినాదాలు చేశారు. దానితో, జిల్లాలో కొన్ని కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
పోలీసు కధనం ప్రకారం, బాగల్‌కోట్‌లోని ఒక కళాశాల సమీపంలో ఒక చిన్న రాళ్ల దాడి సంఘటన జరిగింది. అందులో ముగ్గురు విద్యార్థులు గాయాలకు గురయ్యారు. కొంతమంది విద్యార్థులు క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి కూడా ప్రయత్నించారని, వారిని పోలీసులు తేలికపాటి లాఠీఛార్జ్ ఉపయోగించి చెదరగొట్టారు. శివమొగ్గ జిల్లాలోని ఒక కళాశాలలో కూడా ఇదే విధమైన సంఘటన జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది.