తాను నెహ్రు గురించి మాట్లాడితే కాంగ్రెస్ వారికి అంత భయం ఎందుకని ప్రధాని నరేంద్ర మోదీ చురకలు అంటించారు. తాను నెహ్రూను ఎన్నడూ గుర్తు చేసుకోవడం లేదని అంటూ ఉంటారని, గుర్తు చేసుకున్నపుడు వివాదాస్పదం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
నెహ్రూ అప్పట్లో చెప్పిన మాటలనే తాను ప్రస్తావించానని, . అప్పటి, ఇప్పటి పరిస్థితులను వివరించేందుకే తాను ఆయనను ప్రస్తావించానని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలలో మొదటి దశ పోలింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్లమెంటులో మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ గురించి తాను ప్రస్తావించడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రధాని కొట్టిపారవేసారు.
తాను ఫలానా వ్యక్తి తండ్రి లేదా తాత గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. మాజీ ప్రధాన మంత్రి చెప్పిన మాటలనే తాను ప్రస్తావించానని, ఆ మాటలను తెలుసుకోవడం దేశ ప్రజల హక్కు అని చెప్పారు. తాను నెహ్రూ గురించి మాట్లాడనని ప్రతిపక్షాలు అంటూ ఉంటాయని, తాను మాట్లాడితే మాత్రం వారికి కష్టంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఈ భయం ఏమిటో అర్థం కావడం లేదని చెప్పారు.
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభల ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాలన్నిటిలోనూ బీజేపీ వైపు మొగ్గు ఉన్నట్లు తాను గమనించానని చెప్పారు.
పరాజయంలో కూడా ఆశావాదంతో పని చేస్తామని పేర్కొన్నారు. తాము గెలిచినా, ఓడినా, ఎన్నికలనేవి తమకు ఓ ఓపెన్ యూనివర్సిటీ వంటివని చెప్పారు. ఎన్నికల్లో తాము నూతన రిక్రూట్మెంట్, ఆత్మావలోకనం చేసుకునే అవకాశాన్ని పొందుతామని చెప్పారు. తాము దీనిని ఎన్నికల క్షేత్రంగా పరిగణిస్తామని తెలిపారు.
పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేదని అడగగా “ఏది వినని.. సభలో కూర్చోని వ్యక్తికి తాను ఏం సమాధానం ఇవ్వాలి?” అని ప్రశ్నించారు. పార్లమెంట్లో చర్చను స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేసిన ప్రధాని తాను, తన ప్రభుత్వం ఎవరిపైనా దాడి చేయడం లేదని పేర్కొన్నారు. చర్చలపై తనకు నమ్మకముందని చెప్పారు.
ప్రతి అంశంపై వాస్తవాలను తెలిపామని, ప్రతి అంశంపై వాస్తవాల ఆధారంగా మాట్లాడమని తెలిపారు. కొన్ని విషయాలపై, మా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ వివరణాత్మక సమాధానాలు ఇచ్చారని వివరించారు.
రైతుల హృదయాలను గెలిచాను
రైతులకు నచ్చిన విధంగా చేసి.. వారి హృదయాల్ని గెలుచుకున్నానని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. రైతుల బాధ తనకు అర్థమైందని చెబుతూ రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ చట్టాలను అమలు చేశామని.. కానీ జాతీయ ప్రయోజనాల కోసం వాటిని వెనక్కి తీసుకున్నామని ప్రధాని తెలిపారు. దాదాపు ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనకు దిగారని గుర్తు చేశారు.
వ్యవసాయ బిల్లులపై రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని అడిగిన ప్రశ్నకు ప్రజాస్వామ్యంలో చర్చలే ప్రాతిపదిక అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో, దేశ ప్రజలతో చర్చలు జరపడం ప్రజా ప్రతినిధుల ప్రాథమిక కర్తవ్యమని ప్రధాని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ చర్చలలో పాల్గొంటుందని చెబుతూ అలాంటి చర్చలు ఆపడానికి తాము సిద్దంగా లేమని పేర్కొన్నారు. విధానాలను రూపొందిస్తున్నప్పుడు వాటాదారులతో చర్చల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ ప్రజల నుండి స్వీకరించిన ఫీడ్బ్యాక్పై ప్రభుత్వం పని చేయాలని తాను కోరుకుంటున్నానని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.
‘ఈ అంశంపై నేను మౌనం పాటించాను. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా పరిశీలిస్తోంది. ఈ విషయంలో నేను ఎలాంటి ప్రకటన చేసినా దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని, అది సరికాదు” అని ప్రధాని స్పష్టం చేశారు. .అంతేకాకుండా, న్యాయవ్యవస్థపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, సుప్రీం కోర్టు దేశం ముందు సత్యాన్ని బయటకు తెస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
నిబంధనల ప్రకారమే ఈడీ, సీబీఐ దాడులు
నిబంధలన ప్రకారమే ఈడీ, సీబీఐ సహా అన్ని దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని ప్రధాని స్పష్టం చేశారు. అవినీతిపరుల గురించి తమ ప్రభుత్వానికి ఎప్పుడు సమాచారం అందితే దీనిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దా? అని ప్రశ్నించారు. అక్రమార్కులపై రైడ్స్ చేయడం వల్ల వేల, లక్షల కోట్లు దేశ ఖజానాలో వచ్చి చేరుతుంటే.. తనను ప్రశంసించాల్సిన అవసరం లేదా అని నిలదీశారు.
జమిలి ఎన్నికలు వస్తే సమస్య పరిష్కారం అయిపోతుందని, ఎన్నికల ముందే తమ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయన్న అపవాదు రాదనిమోదీ సూచించారు. దేశంలో ఎప్పుడూ ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, అందుకని ప్రభుత్వం పని చేయడం మానేయాలా అని ఆయన ప్రశ్నించారు.