దేశంలో ప్రతిపక్షాలు లేని అసెంబ్లీగా నాగాలాండ్ నిలిచింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) శాసనసభ్యుడు వైఎం యెల్లో కొన్యాక్ బుధవారం కేబినేట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అక్కడి ప్రభుత్వం అఖిల పక్ష ప్రభుత్వంగా మారింది.
ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి నెఫ్యు రియో, ఆయన మంత్రి వర్గం, యునైటెడ్ డెమొక్రటిక్ అలియన్స్ (యుడిఎ) చైర్మన్ టిఆర్ జెలియాంగ్ హాజరయ్యారు. నాగాలాండ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు దేశంలో తొలి అఖిల పక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన ఐదు నెలల తర్వాత ఇప్పుడు కార్యరూపం దాల్చింది.
నాగాల రాజకీయ సమస్యను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం, నాగా సంస్థలు, ఇతర సమూహాలు ఏకమవ్వడంతో ఇది సాధ్యమైంది. ‘ఒకే పరిష్కారం-ఒకే ఒప్పందం’ కింద నాగా రాజకీయ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర అసెంబ్లీలో 25 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) త ఏడాది జులైలో రియో నేతృత్వంలోని పీపుల్స్ డెమొక్రటిక్ అలియన్స్ (పిడిఎ) ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించింది.
ఐదు అంశాల తీర్మానంలో పాల్గన్న రాజకీయ పార్టీలు, వీలైనంగా త్వరగా రాజకీయ పరిష్కారాన్ని కనుగొనడానికి సానుకూల దృక్పథంతో నాగా శాంతి చర్చలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీని నిమిత్తం అందరం ఏకతాటిపై రావాలని నాగా రాజకీయ సమూహాలకు పిలుపునిచ్చాయి.
ఈశాన్య రాష్ట్రంలో అఖిల పక్ష ప్రభుత్వం ఏర్పడటం ఇది రెండో సారి. 2015లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు.. అప్పటి అధికారంలో ఉన్న నాగా పీపుల్స్ ఫ్రంట్‌లో విలీనమైనప్పుడు..అఖిల పక్ష ప్రభుత్వం ఏర్పడింది.