నిపుణుల సంప్రదింపుల తర్వాత క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనే దానిపై . కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పా రు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్రిప్టోకరెన్సీలపై రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ వర్చువల్ కరెన్సీల వల్ల వచ్చే లాభాలపై కేంద్ర ప్రభుత్వం 30 శాతం పన్ను విధించడానికి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల చట్టబద్ధతతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
క్రిప్టోకరెన్సీ లావాదేవీల వల్ల వచ్చిన లాభంపై పన్ను విధించే సార్వభౌమ హక్కు ప్రభుత్వానికి ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. “క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనేది నిపుణుల సంప్రదింపుల తర్వాత తెలుస్తుంది” అని సీతారామన్ తెలిపారు.
వ్యక్తి ఆదాయపు పన్ను స్లాబ్‌తో సంబంధం లేకుండా క్రిప్టోకరెన్సీ బదిలీలపై ద్వారా వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధించే ప్రతిపాదనను బడ్జెట్లో ఆమె ప్రకటించారు. ఈ ప్రకటనతో దేశంలో క్రిప్టోకరెన్సీలకు చట్టబద్దత వచ్చినట్లేనని పలువురు భావించారు. ఈ అంశంపై సీతారామన్ స్పష్టతనిస్తూ.. క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనేది నిపుణుల సంప్రదింపుల తర్వాత తెలుస్తుందని ప్రకటించారు.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడంతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. డిజిటల్ కరెన్సీతో మరింత సమర్థవంతమైన చవకైన నగదు నిర్వహణ చేపట్టవచ్చని ప్రకటించారు. అయితే ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు ఆర్థిక అస్థిరతకు దారితీస్తాయంటూ గతంలో రిజర్వ్‌బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ఫిబ్రవరి 10న జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వాలకు ఈ కరెన్సీ ముప్పని స్పష్టం చేశారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను గవర్నర్ హెచ్చరించారు.
అటువంటి అసెట్స్‌కు ఎటువంటి అంతర్లీన విలువా ఉండదని గవర్నర్ పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ.. తులిప్ పువ్వుకన్నా దిగదుడుపని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన 17వ శతాబ్దంలో వచ్చిన ‘తులిప్ మ్యానియా’ను గుర్తుచేశారు.