దాదాపు గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిరీతిలో అమెరికాలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో నమోదైందని అమెరికా కార్మిక శాఖ తెలిపింది. జనవరిలో వినియమ ధరలు అత్యంత వేగంగా పెరిగాయని పేర్కొంది. దీంతో ఫెడరల్ రిజర్వ్ మరింత కట్టుదిట్టంగా ద్రవ్య విధానానిు రూపొందించే అవకాశాలు పెరిగాయి.
గత నెల్లో వినిమయ ధరల సూచీ (సిపిఐ) అంతకుముందు నెలతో పోలిస్తే 0.6శాతం పెరిగింది. గతేడాదితో పోలిస్తే 7.5శాతం పెరుగుదల నమోదైంది. 1982 జూన్ తర్వాత అతిపెద్ద వార్షిక పెరుగుదల ఇదేనని కార్మిక శాఖ గణాంకాలు తెలిపాయి. డిసెంబరులో 0.5శాతం పెరగగా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఏడు శాతం పెరిగింది.
ఆహారం, ఇంధనం మినహాయించిన తర్వాత వినిమయ ధరల సూచీ గత 12 మాసాల్లో ఆరు శాతం పెరగగా, డిసెంబరుతో ముగిసిన 12 మాసాల కాలంలో 5.5శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. గతేడాది కాలంలో ఇంధన సూచీ 27శాతం పెరగ్గా, ఆహార సూచీ 7శాతం పెరిగింది.
అధిక ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది చేసిన కట్టుదిట్టమైన చర్యల కన్నా వేగంగా ఈసారి వడ్డీ రేట్లను పెంచడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్కి ఇది సరైన సమయం కాగలదని సీనియర్ ఫెడరల్ అధికారి వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ తాజా ద్రవ్యోల్బణ డేటా వెలువడింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు గానూ మార్చిలో వడ్డీరేట్లు పెంచుతూ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా వున్నామని గత నెల్లోనే ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది.