తెలంగాణ సర్కార్ ఉపాధ్యాయులను ఉగ్రవాదులుగా చూస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. జీవో 317కు సవరణలు చేయాలని ఇందిరాపార్కులో శాంతియుతంగా నిరసన చేయాలనుకున్న ఉద్యోగులను రాత్రికి రాత్రే ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడం దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు.
ప్రశ్నించే గొంతంటే కేసీఆర్కు నచ్చదని, ప్రశ్నించే వారిని ఎలాగైనా నోరు మెదపకుండా చేయడానికి ఎన్ని పన్నాగాలైనా చేస్తారని ఆమె ఆరోపణలు చేశారు. 317 జీవోపై ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు… టీఆర్ఎస్ నిరసనలకు మాత్రం అనుమతినివ్వడం సిగ్గుచేటని విజయశాంతి మండిపడ్డారు.
తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రమే అమలవుతోందనడానికి ఇదే నిదర్శనమని ఆమె చెప్పారు. రాష్ట్రం వొచ్చినంక ఎట్లాంటి సమస్యలుండవని ఆశిస్తే… గత పాలకులకన్నా కేసీఆర్ నిరంకుశ పాలన చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు.