బడ్జెట్లో పేదలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ”మానసిక పేదరికం గురించి మాట్లాడాలా? కాస్త స్పష్టంగా చెప్పండి” అంటూ గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు.
కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి సమాధానమిస్తూ ఈ వాఖ్య చేయడంతో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి పేదలను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు.
దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి ”నేను పేదలను ఎగతాళి చేయడం లేదు. పేదలను అపహాస్యం చేసిన వారితోనే మీ పార్టీ పొత్తు పెట్టుకుంది. మీ (కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ) మాజీ అధ్యక్షుడు గతంలో పేదరికానికి కొత్త అర్థం చెప్పారు” అంటూ గుర్తు చేశారు.
“‘పేదరికం అంటే.. దుస్తులు, తిండి, డబ్బు లేకపోవడం కాదు. అది కేవలం మానసిక స్థితి మాత్రమే. ఆత్మ విశ్వాసంతో దాన్ని అధిగమించొచ్చు అని రాహుల్ అన్నారు. ఆ పేదరికం గురించే మాట్లాడమంటారా?” అని ఆమె ఎదురు ప్రశ్న వేశారు.
”రాబోయే 25 ఏళ్లు భారతదేశానికి ముఖ్యమైనవి. భారతదేశం కోసం ఒక విజన్ కలిగి ఉన్నాం. 65 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక కుటుంబాన్ని ఆదుకోవడం, నిర్మించడం, ప్రయోజనం పొందడం తప్ప ఎటువంటి దృక్పథం లేదు” అని ఆర్ధిక మంత్రి కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు.
కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి, సుస్థిరత సాధించడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది బడ్జెట్ లక్ష్యం ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా కోలుకోవడమేనని ఆమె చెప్పారు. ఈ మహమ్మారి వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని గుర్తు చేశారు.
ఇలా ఉండగా,తాను నేరుగా ప్రజల నుంచి ఎన్నిక కాలేదని, తనకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియవని ప్రతిపక్షాలు ఆరోపించడంపై నిర్మల సీతారామన్ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్న కాలంలోని రాజ్యసభ సభ్యులు కూడా వాస్తవానికి దూరంగానే ఉన్నారా? అని ప్రశ్నించారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా వాస్తవాలకు సంబంధం లేకుండా వ్యవహరించారా? అని నిలదీశారు.