కీలకమైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో ఈ నెల 10న జరిగిన మొదటి దశ పోలింగ్ లో రైతు ఉద్యమం తీవ్ర ప్రభావం చూపే పశ్సీమ ప్రాంతంలోని నగరాలలో తమకు బలంగా ఉన్న నగరాలలో తక్కువగా పోలింగ్ జరగడం బిజెపి వర్గాలలో ఆందోళనకు కారణం అవుతున్నట్లు తెలుస్తున్నది. పలువురు ప్రముఖులు తమ స్థానాలను కోల్పోవడం ఖాయం అని బీజేపీ నేతలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ కూడా నోయిడా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఓడిపోవచ్చని కొందరు సన్నిహితులు పేర్కొన్నారు. ఆగ్రా, మతురా, అలీగఢ్ ప్రాంతాలతో కూడిన బ్రజ్‌లోని వారి నియోజకవర్గాల్లో పలువురు మంత్రుల అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉధృతంగా ప్రచారం నిర్వహించే పార్టీ యంత్రాంగం ఈ సారి ఆశించినరీతిలో పనిచేయలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓటర్లను ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చి ఓటింగ్ వేసేటట్లు చేయడంలో పన్నా ప్రముఖ్, బూత్ కమిటీ సభ్యులు ఎక్కడున్నారు? అని ప్రశ్నలు పార్టీ వర్గాలలో తలెత్తుతున్నాయి.
11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో తొలి దశ ఎన్నికలు జరిగాయి. ఈ జిల్లాలు 2017లో 63.47 శాతం ఓటింగ్ జరుగగా, 2022లో అది 60.17 శాతానికి పడిపోయింది. ఇది, షామ్లీ వంటి కొన్ని జిల్లాల్లో 2017తో పోలిస్తే ఈసారి దాదాపు 2 శాతం ఎక్కువ పోలింగ్ నమోదైనప్పటికీ, మీరట్‌లో 2022లో 5 శాతానికి పైగా పోలింగ్ శాతం తగ్గింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మీరట్‌లో పోలింగ్ శాతం 66.64 శాతం కాగా, 2022లో అది 60.91 శాతంకు తగ్గింది.
అత్యల్పంగా ఘజియాబాద్‌లో 54.77 శాతం, గౌతమ్ బుద్ నగర్ (నోయిడా)లో 56.73 శాతం పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తక్కువగా ఉందని స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. పైగా, హిందువుల ప్రాబల్యం ఉన్న పట్టణ ప్రాంతాల కంటే ముస్లిం ఆధిపత్య ప్రాంతాలు ఎక్కువ ఉత్సాహాన్ని కనబరిచాయని భావిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం పనిచేయడంలో పార్టీ సంస్థాగత యంత్రాంగం విఫలమైన్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. తక్కువ పోలింగ్ శాతం యోగి ప్రభుత్వంలోని పలువురు మంత్రుల భవిష్యత్తుపై కూడా ప్రశ్నలను లేవనెత్తింది. ఆగ్రా కంటోన్మెంట్ లో పోలింగ్ శాతం కేవలం 56 శాతం మాత్రమే. విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ బిజెపి అభ్యర్థిగా ఉన్న మథుర నగర నియోజకవర్గంలో పోలింగ్ శాతం 57.33 కాగా, జిల్లాలో 62.90 శాతం ఓట్లు పోలయ్యాయి.
అలీగఢ్‌లో పోలింగ్ జరిగిన ఏడు నియోజకవర్గాలలో, యోగి ప్రభుత్వంలో మంత్రి, కళ్యాణ్ సింగ్ మనవడు సందీప్ సింగ్ పోటీలో ఉన్న అత్రౌలీలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. అట్రౌలీకి 59.7 శాతం పోల్ కాగా, బరోలి అసెంబ్లీ నియోజకవర్గంలో 63.41 శాతం ఓట్లు నమోదయ్యాయి.
ప్రధాని ముందే గ్రహించారా!
యుపి పశ్చిమ ప్రాంతంలో ప్రతికూల పవనాలు వీస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ముందుగానే గ్రహించిన్నట్లు కనిపిస్తున్నది. అందుకనే గత నెలరోజులలో ఈ ప్రాంతంలో పెద్దగా ఎన్నికల ప్రచారం చేయలేదు.
కేవలం రెండు ఆన్ లైన్ ప్రచారంలకు పరిమితమయ్యారు. ఈ నెల 7న ఒక బహిరంగసభలో పాల్గొనవలసి ఉన్నప్పటికీ `ప్రతికూల వాతావరణం’ పేరుతో ఆ సభను రద్దు చేసుకొని, ఆన్ లైన్ కార్యక్రమంగా మార్చారు.
పశ్చిమ బెంగాల్ లో విస్తృతంగా ప్రచారం చేయడంతో తన ఇమేజ్ పై ప్రతికూల ప్రభావం పడడంతో ప్రధాని ఈ పర్యాయం జాగురతతో వ్యవహరిస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
హిజాబ్ వివాదం బిజెపికి కలసి వస్తుందా!
కర్ణాటకలో ఒకటి, రెండు జిల్లాలకు పరిమితంగా ప్రారంభమైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందడం, జాతీయ అంశంగా మారడం వెనుక బిజెపి వ్యూహం ఉన్నట్లు ఈ సందర్భంగా పరిశీలకులు భావిస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని మిగిలిన ఏడు దశలలో జరిగే పోలింగ్ లలో ఓటర్ల మధ్య మతపరమైన విభజన తీసుకు రావడానికి, తద్వారా ప్రయోజనం పొందే ప్రయత్నాలు చేస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే కామన్ సివిల్ కోడ్ అమలు పరుస్తామని ప్రకటించడం వెనుక కూడా యుపి ఓటర్లను ఉద్దేశించే కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
హిజాబ్ వివాదాన్ని ఆసరా చేసుకొని దేశమంతా ఒకే పౌర స్మృతి తీసుకు రావడానికి ఇదే సమయం అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించడం గమనార్హం. హిజాబ్‌ను తాకేందుకు ప్రయత్నించే చేతులను తెగనరుకుతాని అలీగఢ్ ముస్లి యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులు ఆందోళన సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ నేత రుబీనా ఖానం చెప్పడం కూడా బిజెపి ఎన్నికల ప్రచారానికి కలసివచ్చే అవకాశం ఉంది.