నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద రేవంత్‌రెడ్డి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు.
జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని ఇంటి చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి రేవంత్ ను గృహనిర్బంధం చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్ల వద్ద ధర్నాలకు యత్నించిన కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మధుయాష్కీ, తదితరులను పోలీసులు అడ్డుకున్నారు.
2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించి ఆధారాలు బయటపెట్టాలని రాహుల్‌గాంధీ ఇటీవల పార్లమెంట్లో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పుట్టకపై తామేమైనా రుజువులు అడిగామా? అని శర్మ ప్రశ్నించడం వివాదాస్పదమైంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. రెండు రోజుల క్రితం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఐపిసి 504, 505 క్లాజ్ 2 సెక్షన్ల కింద అసోం సిఎం బిశ్వ శర్మపై కేసు నమోదు చేశారు.
ఇలా ఉండగా,అసోం సీఎంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్లో సెక్షన్లు నమోదు చేయకపోవడంతో మరోసారి ఫిర్యాదు చేశారు. పోలీసులు పెట్టిన ఐపీసీ 504, 505(2) సెక్షన్లపై టీపీసీసీ చీఫ్ అభ్యంతరం తెలిపారు. 153A,505(2),294,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు.
కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని రేవంత్‌కు పోలీసులు తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారరి.. కానీ అందులో సెక్షన్లు సరైనవి కాదని పేర్కొన్నారు. నేర తీవ్రతను తగ్గించినందుకు నిరసన తెలియజేశామని తెలిపారు.
రాహుల్‌పై వ్యాఖ్యలను అసోం సీఎం సమర్థించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సభ్య సమాజంలో మనుషులు మాట్లాడే భాష మాట్లాడలేదని మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని, మహిళలను కించపరిచేలా మాట్లాడారని విమర్శించారు. అసోం సీఎం వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని, మోదీ సర్కార్ వెంటనే అసోం సీఎంను బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.