మొత్తం దేశ ప్రజల ఆసక్తితో గమనిస్తున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి, సమాజవాద్ పార్టీలు అధికారం కోసం తీవ్రంగా పోటీ పడుతుండగా, ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ పోటీచేస్తున్న ఈటా జిల్లాలోని ‘కాస్గంజ్’ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది.
బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ వంటి పెద్ద పార్టీలు మొదలుకొని ఆర్ఎల్డీ వంటి చిన్నా చితకా పార్టీల వరకు.. అన్ని పార్టీలు ఇప్పుడు కాస్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం పైనే దృష్టి సారించాయి. ఎట్లాగైనా అక్కడ గెలవాలనే పట్టుదలతో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే ‘కాస్గంజ్ ఒడిసిపట్టు.. యూపీ అధికారం చేపట్టు’అన్న రీతిలో పార్టీలు కాస్గంజ్ పై ఫోకస్ పెట్టాయి. అందుకు ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే ‘కాస్గంజ్ లో గెలిచిన పార్టీయే… రాష్ట్ర అధికార పీఠాన్ని కూడా చేపడుతుంద’నే నమ్మకం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన మొత్తం 17 ఎన్నికల్లో 12 సార్లు కాస్గంజ్ లో గెలిచిన పార్టీలే రాష్ట్రంలో అధికార పీఠాన్ని చేపట్టాయి.
- 1952లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్గంజ్ లో కాంగ్రెస్ కు చెందిన బాబూరామ్ గుప్తా విజయం సాధించగా…. యూపీలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది.
- 1957లో కాంగ్రెస్‌కు చెందిన కాళీచరణ్ అగర్వాల్ కాస్గంజ్లో విజయం సాధించగా.. రాష్ట్రంల మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
- 1977లో ఇక్కడ జనతాదళ్‌కు చెందిన నేత్రమ్ సింగ్ గెలువగా … యూపీలో జనతాదళ్ అధికారంలోకి వచ్చింది.
- 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్‌పాల్ సింగ్ విజయం సాధించగా.. ఆ పార్టీ మళ్లీ యూపీని పాలించింది.
- 1985 లో అదే అభ్యర్థి, అదే పార్టీ … సీన్ పునరావృతమైంది.
- 1989లో జనతాదళ్‌కు చెందిన గోవర్ధన్ సింగ్ కాస్గంజ్లో విజయం సాధించగా.. ములాయం సింగ్ యాదవ్ సీఎం గా జనతాదళ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
- 1991లో బీజేపీ నేత నేత్రమ్ సింగ్ మళ్లీ కాస్గంజ్లో విజయం సాధించారు. కళ్యాణ్ సింగ్ సీఎంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
- 1996లో నేత్రం సింగ్ బీజేపి నుంచి విజయం సాధించగా… రాష్ట్రంలో బీజేపీ-బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటైంది.
- 2002లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మన్‌పాల్ సింగ్ కాస్గంజ్లో విజయం సాధించారు. కానీ బీజేపీ, బీఎస్ పీ కూటమి అధికారం చేపట్టగా.. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో…2003 లో ఎస్పీ అధికారంలోకి వచ్చింది.
- 2007లో బీఎస్పీకి చెందిన హస్రత్ ఉల్లా ఖాన్ కాస్గంజ్ను గెలుచుకోగా..మాయావతి అధికారంలోకి వచ్చారు.
- 2012లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి మన్‌పాల్ సింగ్ ఇక్కడ గెలుపొందగా… అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
- 2017లో బీజేపీకి చెందిన దేవేంద్ర రాజ్‌పుత్ కాస్గంజ్లో విజయం సాధించారు.యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో పార్టీ అధికారం చేపట్టింది.
ఇప్పుడు 2022, ఫిబ్రవరి 20న కాస్గంజ్ కు ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజ్‌పుత్, ఎస్పీ అభ్యర్థి మన్‌పాల్ సింగ్ మధ్యే తీవ్ర పోటీ ఉండబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మినీ భారత్ గా పిలిచే యూపీ ఎన్నికల్లో గెలిస్తే కేంద్రంలో అధికారం చేపట్టడం ఈజీ అవుతుందని రాజకీయ పార్టీల నమ్మకం. అందుకే నరేంద్ర మోదీ. యోగి ఆదిథ్యనాథ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్, మాయావతి వంటి బడా నేతలు కాస్గంజ్ పై నజర్ పెట్టారు.