ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో మూడవ దశలో ఈ నెల 20న పోలింగ్ జరుగనున్న తదుపరి యుద్ధభూమి తరచుగా ‘యాదవుల కోట’గా ముద్రించబడే ప్రాంతం కీలకం కానున్నది. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి మొదటి రెండు దశలలో సంతృప్తికరంగా ఓట్లు పొందిన్నట్లు భావిస్తున్నది.
అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో వెళ్లాలంటే మూడవ దశ ఓటర్లలో కీలకమైన యాదవ్ ఓటర్లు అఖిలేష్ యాదవ్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఫిబ్రవరి 20న 16 జిల్లాల్లోని 59 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో మెయిన్‌పురి, ఎటా, కాస్గంజ్, హత్రాస్, ఫిరోజాబాద్ జిల్లాల్లోని 19 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
అలాగే, కాన్పూర్, కాన్పూర్ రూరల్, ఫరూఖాబాద్, ఒరైయా, ఇటావా మరియు కన్నౌజ్‌లోని 27 అసెంబ్లీ నియోజకవర్గాలు, బుదేల్‌ఖండ్ ప్రాంతంలోని 13, అంటే ఝాన్సీ, జలౌన్, హమీర్పూర్, లలిత్పూర్ మరియు మహోబా జిల్లాల్లో నివసిస్తున్న ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు.
కర్హల్ (మెయిన్‌పురి) నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తుండగా, ఆయనపై పోటీకి బిజెపి కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్ ని దించింది. జస్వంత్ నగర్ (ఇటావా) నుంచి ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, మాజీ మంత్రి శివపాల్ యాదవ్, మాజీ మంత్రి రాంవీర్ ఉపాధ్యాయ అభ్యర్థులు ఈ దశలో ఉన్నారు. సదాబాద్ (హత్రాస్), ఫరూఖాబాద్ నుండి మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ భార్య లూయిస్ ఖుర్షీద్, కన్నౌజ్ నుండి మాజీ ఐపీఎస్ అధికారి అసిమ్ అరుణ్ పోటీ చేస్తున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ , బీజేపీ నేతృత్వంలోని కూటములు రెండింటికీ, ఈ దశ అత్యంత క్లిష్టమైనది. యోగి ఆదిత్యనాథ్ అధికారం నిలుపుకోగలరా? అఖిలేష్ మరోసారి ముఖ్యమంత్రి కాగలరా? లేదా హంగ్ అసెంబ్లీ ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటులో బీఎస్పీ లేదా కాంగ్రెస్ కీలకం కాగలవా? అన్నది ఈ దశలో తేలే అవకాశం ఉంది.
2017 ఎన్నికల్లో గెలుపొందిన 49 స్థానాల్లో తన పట్టును నిలబెట్టుకోవడం బీజేపీకి చాలా కష్టమైన పని. అఖిలేష్‌కు, 2017 ఓటమి తర్వాత యాదవ్ ఓటర్లలో ఆమోదయోగ్యతకు ఇది మొదటి పరీక్ష. ములాయం కుటుంబంలోని అంతర్గత పోరు కారణంగా సమాజ్‌వాదీ పార్టీ నుండి శివపాల్ యాదవ్‌ను తొలగించదాంతో 2017, 2019లలో జరిగిన ఎన్నికలలో బిజెపి గణనీయ సంఖ్యలో యాదవుల మద్దతు పొందగలిగింది.
మూడో దశ పోలింగ్ కూడా ఈ ఎన్నికల్లో తొలిసారిగా ముస్లిం-యాదవ ఓటర్లకు అగ్నిపరీక్ష కానుంది. 2017 నుండి, యాదవ్ ఓటర్లు పార్టీకి బదులుగా కులం పేరుతో ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారు. దీంతో చాలా మంది ముస్లిం అభ్యర్థులు యాదవ్‌లు అధికంగా ఉండే బూత్‌లలో ఓడిపోయారు.
మొదటి రెండు దశల్లో సమాజ్‌వాదీ పార్టీ సాధించిన ఊపును కొనసాగించాలంటే ముస్లిం, యాదవ ఓటర్లే కాకుండా యాదవేతర ఓబీసీలలో కొంత మంది కూడా తమకు ఓటు వేయాలని భావిస్తోంది.
ఈ దశ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీలకు కూడా కీలకం కానున్నాయి.
జలౌన్, కల్పి, ఒరై, హమీర్పూర్, బందా, హత్రాస్ సంవత్సరాల తరబడి బీఎస్పీ కోటలుగా ఉన్నాయి. ఈసారి కూడా బుందేల్‌ఖండ్‌లోని చాలా స్థానాలు, బ్రిగ్ ప్రాంతంలోని మిగిలిన స్థానాలపై త్రిముఖ పోరు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కూడా ఈ దశలో మెరుగైన ఫలితాలను ఆశిస్తోంది. 2017 ఎన్నికల సమయంలో గెలిచిన రెండు సీట్లను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.
మూడో విడతలో ఎవరు గెలిచినా ఓడిపోయేది బీజేపీనే. ఎన్నికలు జరగనున్న 59 స్థానాల్లో 2017 ఎన్నికల్లో బీజేపీ 49 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఈ 16 జిల్లాల్లో అధికార పార్టీకి గండి పడుతుందని అంచనా వేస్తున్నారు. శివపాల్ యాదవ్ , అఖిలేష్ యాదవ్ మధ్య రాజీ తర్వాత పార్టీ తన యాదవ్ స్థావరాన్ని నిలుపుకోవడంలో విజయవంతమైతే, ఫిబ్రవరి 20న మూడో దశ ఓటింగ్ ముగిసిన తర్వాత బీజేపీ ఆట ముగిసిపోయిన్నట్లే కాగలదు.