కర్ణాటకలో కొన్ని కళాశాలలో ప్రారంభమైన హిజాబ్ వివాదం జాతీయ స్థాయికి చేరుకోవడంతో తొలుత హిందూ – ముస్లిం విభజనకు దారితీసి, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో రాజకీయంగా లబ్ధిపొందవచ్చని కొందరు బిజెపి నాయకులు భావించారు. సోషల్ మీడియాలో, ఇతరత్రా హిజాబ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
అయితే బిజెపి ముస్లిం మహిళలకు వ్యతిరేకం అనే సంకేతం ఈ వివాదం ఇచ్చే ప్రమాదం ఉన్నట్లు ఆలస్యంగా గ్రహించినట్లు కనిపిస్తున్నది. పైగా,ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలో పొందిన సానుభూతిని దూరం చేసుకొనే ప్రమాదం ఉన్నదనే ఆందోళనలో పడినట్లు కనిపిస్తున్నది. అందుకనే ఇప్పుడు దిద్దుబాటు చర్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది.
కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక బీజేపీ నేతలకు ఆ పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. బీజేపీ ముస్లిం మహిళలకు వ్యతిరేకం కాదని సంబంధితులందరికీ స్పష్టంగా తెలియజేయాలని తెలిపింది. వస్త్ర ధారణకు సంబంధించిన నిబంధనలను ఆయా విద్యా సంస్థలకే వదిలిపెట్టినట్లు వివరంగా చెప్పాలని తెలిపింది. బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు ఈ వివరాలను స్థానిక మీడియాతో పంచుకున్నారు.
హిజాబ్ వివాదంపై సంయమనం పాటించాలని తమను తమ పార్టీ అధిష్ఠానం ఆదేశించిందని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ వివాదం సద్దుమణగడానికి కృషి చేయాలని తెలిపినట్లు చెప్పారు. మంగళూరు సిటీ బీజేపీ ఎమ్మెల్యే భరత్ షెట్టి మాట్లాడుతూ, హిజాబ్ వివాదం నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపై తమ పార్టీ అధిష్ఠానం తమకు ఓ సలహా ఇచ్చిందని తెలిపారు.
అయితే దీనిపై నిర్దిష్ట సూచనలేవీ చేయలేదని స్పష్టం చేశారు. సంబంధితులందరి వద్దకు వెళ్ళాలని, వారిని విశ్వాసంలోకి తీసుకోవాలని చెప్పినట్లు తెలిపారు. విద్యా సంస్థల యాజమాన్యాలు, కమ్యూనిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులతో స్థానికంగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వాస్తవానికి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఈ విషయమై సంయమనం పాటిస్తూ వస్తున్నది. రాష్ట్ర హైకోర్టు నిర్ణయానికి వదిలేస్తున్నామని, కోర్ట్ తీర్పు ప్రకారం నడుచుకొంటామని, అప్పటి వరకు సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విజ్ఞప్తి చేశారు.
యూనిఫాం డ్రెస్ కోడ్‌ను పాటించడానికి ఇష్టపడని విద్యార్థులు ఇతర ఎంపికలను చేసుకొనే స్వేచ్ఛ ఉందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ కూడా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 75 వేల హైస్కూళ్లు, కళాశాలల్లో కేవలం ఎనిమిదిలో మాత్రమే హిజాబ్ వివాదం ఏర్పడిందని అంటూ సమస్యను తక్కువగా చేసి చూపే ప్రయత్నం చేశారు.
ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
“మిలిటరీలో నియమాలు అనుసరిస్తున్నట్లే, ఇక్కడ (విద్యాసంస్థల్లో) కూడా అదే చేయాలి. దానిని అనుసరించడానికి ఇష్టపడని వారికి వారి అభీష్టాలకు అవకాశాలు ఉన్నాయి. దానిని వారు ఉపయోగించుకోవచ్చు” అని తెలిపారు.
నగేష్ ముస్లిం శాసనసభ్యులతో సమావేశమై ముస్లిం బాలికలు తరగతుల్లో హిజాబ్ , ఇతర మతపరమైన దుస్తులను తాత్కాలికంగా నిషేధించిన హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి తరగతి గదులకు తిరిగి వచ్చే విధంగా చేసే ప్రయత్నం చేశారు. “యూనిఫామ్ డ్రెస్ విధానంలో సవరణలు అవసరం. ప్రస్తుతం పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. కొత్త విధానంను తీసుకురావడానికి హైకోర్టు ఆదేశం కోసం మేము వేచి ఉంటాము” అని నగేష్ వారికి చెప్పారు.
మరోవంక, జమ్మూ కాశ్మీర్ లో అయితే ఆ పార్టీ నేతలు హిజాబ్ కు స్పష్టమైన మడ్దతు తెలుపుతూ వస్తున్నారు. పైగా, వివాదానికి పాల్పడిన వారిని శిక్షించాలని కోరుతున్నారు. సిక్కులు తలపాగాలు కలిగి ఉంటే, ప్రతి ఒక్కరూ దానితో సౌకర్యవంతంగా ఉంటే, ఎవరైనా ముస్లిం అమ్మాయిలతో హిజాబ్‌తో ఎందుకు సమస్యలను కలిగి ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు.
దుపట్టాతో తల కప్పుకుని, కర్ణాటకలో ఏం జరిగినా తాను ఖండిస్తున్నానని జమ్మూ కాశ్మీర్ బిజెపి నాయకురాలు దరక్షణ్ ఆంద్రాబీ స్పష్టం చేశారు. “అమ్మాయిలు హిజాబ్‌లో ఉండడాన్ని నేను ఎందుకు ఖండించాలి? నేను ఎప్పుడూ హిజాబ్‌లోనే ఉంటాను. హిజాబ్ తప్పు కాదు. తల్లి సీతమ్మ కూడా తలపై దుప్పట్టా పెట్టుకుంది. దీన్ని హిందూ, ముస్లిం సమస్యగా మార్చకూడదు’’ అని ఆమె హితవు చెప్పారు. ఆమె బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు కాకుండా, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యురాలు కూడా.
“హిజాబ్ ధరించిన ఒక అమ్మాయి నడుస్తోంది. అబ్బాయిలు జై శ్రీరామ్ అని అరిచారు. వో బచ్చోన్ కా ఖేల్ థా (అది పిల్లల ఆట). పార్టీకి దానితో సంబంధం లేదు. ఇందులో పార్టీకి చెందిన వారు ఎవరూ లేరు’ అని ఆమె చెప్పారు.
ఖాదీ అండ్ విలేజ్ బోర్డ్ వైస్ చైర్పర్సన్ కూడా అయిన బీజేపీ నాయకురాలు హీనా భట్ కూడా ఇదే మాట అన్నారు. ఏది వేసుకోవాలో, వేసుకోకూడదో ఎలాంటి విధివిధానాలు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు.
“ఒక వ్యక్తి ఏమి ధరించాలనుకుంటున్నాడో లేదో అతనికే వదిలేద్దాం. అతను హిజాబ్ ధరించాలా వద్దా అనేది వ్యక్తిగత ఎంపిక. నేను ఎలాంటి విధింపునకు వ్యతిరేకం” అని ఆమె చెప్పింది. ఆంద్రాబీ, భట్ ఇద్దరూ తమ ట్విట్టర్ హ్యాండిల్లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసేటప్పుడు హిజాబ్‌లో ఉన్న చిత్రాలను ప్రదర్శించారు.