2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్లతో సమాజ్వాదీ పార్టీకి సంబంధాలు ఉన్నాయని, ఆ పార్టీ నేత ఒకరు ఉగ్రవాదులకు రక్షణ కల్పించారని అంటూ బీజేపీ తీవ్రమైన ఆరోపణ చేసింది. ముఖ్యంగా కీలకమైన మూడో దశ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ సంచలన ఆరోపణ చేశారు.
పేలుళ్ల సూత్రధారుల్లో ఒకరు సమాజ్వాదీ పార్టీ నేత కొడుకు అని ఠాకూర్ తీవ్ర ఆరోపణలు చేశారు. 56 మందిని బలిగొన్న, 200 మందికి పైగా గాయపడిన ఈ కేసులో ట్రయల్ కోర్టు 38 మంది దోషులకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. మరో 11 మందికి జీవిత ఖైదు పడింది.
కేంద్ర మంత్రి ఆరోపణ ప్రకారం, సమాజ్వాదీ పార్టీ నాయకుడు షహబాద్ అహ్మద్ కుమారుడు మహమ్మద్ సైఫ్ సూత్రధారులలో ఒకరు. సమాజ్వాదీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, ఎస్పీ హయాంలో గూండాలు, ఉగ్రవాదులు బలపడ్డారని ఆయన ఆరోపించారు.
ఈ విషయమై ఠాకూర్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్లో గూండాలు, మాఫియాలను అంతమొందించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. కాగా,
2012లో యూపీ ఎన్నికల ముందు సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టోలో ముస్లిం యువకులపై మోపిన ఉగ్రవాద ఆరోపణలను వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చారని ఠాకూర్ గుర్తు చేశారు.
ఆ సమయంలో, ముస్లిం యువకులపై ఉగ్రవాద ఆరోపణలను ఉపసంహరించుకుంటామని మానిఫెస్టోలో హామీ ఇచ్చిన మొదటి జాతీయ రాజకీయ పార్టీ సమాజ్వాదీ అని ఆయన తెలిపారు.