టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముంబై వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లను కలసి జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు గురించిన సమాలోచనలు జరిపి రాగానే ఆ పార్టీ శ్రేణులు తెలంగాణాలో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
ఆయన ప్రాంతీయ పార్టీలు అన్నింటిని కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేయబోతున్నారని, 2024 ఎన్నికలలో ఆ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు. అంతేకాదు, కేసీఆర్ ను కాబోయే ప్రధాన మంత్రిగా కూడా ఊహించుకుంటున్నారు.
ముంబై నుండి తిరిగి వచ్చాక, మరుసటి రోజు నారాయణ ఖేడ్ లో సంగమేశ్వర బసమేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తూ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించి అమెరికకన్నా గొప్పగా భారత్ ను అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షను స్వయంగా కేసీఆర్ వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడే దేశంలో మూడో కూటమి ఏర్పాటు సాధ్యమని గని, ప్రాంతీయ పార్టీలు అన్ని కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారని వహించడం తొందరపాటు కాగలదు. రాజకీయ ఎత్తుగడలతో కాకలు తీరిన కేసీఆర్ కూడా ఆ విధంగా భావిస్తున్నారని అనుకోలేము. వాస్తవ పరిస్థితులను అర్ధంచేసుకోలేక ఊహాలోకంలో ఆయన విహరిస్తారని కూడా భావింపలేము.
అయితే ఆయన జాతీయ రాజకీయాల ప్రస్తావన తీసుకు రావడం, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రయత్నాలు చేయడం వెనుక బలమైన వ్యూహం దాగి ఉండాలి. రాష్ట్రంలో తన పాలన పట్ల అసంతృప్తిగా ఉన్న ప్రజల దృష్టి మళ్లించడం కోసం కావచ్చు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరచలేక, వారిని మరో విధంగా ఆకట్టుకొనే ప్రయత్నం కావచ్చు.
లోక్ సభ ఎన్నికలకన్నా ముందే డిసెంబర్, 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగవలసి ఉంది. గతంలో మాదిరిగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెడితే 2023 ప్రారంభంలోనే జరుగవచ్చు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల సమయానికి తనను ఒక గొప్ప జాతీయ నాయకుడిగా ప్రజల ముందుంచడం కోసం, తద్వారా వారి మద్దతు పొందేందుకు చేస్తున్న ప్రయత్నం కావచ్చు.
మరోవంక, ముఖ్యమంత్రి పదవిని ఖాళీ చేయమని గత ఏడాది కాలంగా కుమారుడు కేటీఆర్ నుండి వత్తిడులు వస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి. అయితే కేటీఆర్ ఏమాత్రం ప్రజల మద్దతు కూడదీసుకోగలరన్నది ఇప్పటి వరకు స్పష్టం కాలేదు.
సొంత పార్టీలో కూడా కేటీఆర్ వస్తే పెద్దఎత్తున సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ వంటి వారిని మంత్రివర్గం నుండి తొలగించడం కేవలం కేటీఆర్ కు పోటీగా సమర్థులైన నాయకులు ఉండరాదనే ఎత్తుగడగా కూడా పలువురు భావిస్తున్నారు.
కేసీఆర్ ముంబైలో ఉండగానే ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ సంఘీభావం తెలిపారని కధనాలు ఇక్కడ వెలువడ్డాయి. అయితే మరుసటి రోజే థాకరేతో జరిపిన సమావేశంలో పాల్గొన్న శివసేన రాజ్యసభ ఎంపి సంజయ్ రౌత్ కాంగ్రెస్ లేకుండా ఎటువంటి కూటమి ఏర్పాటు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
మరోవంక, సిపిఎం సహితం కాంగ్రెస్ లేని కూటమిని కోరుకోవడం లేదు. ముఖ్యంగా ఏర్పడబోయే కూటమికి మమతా బెనర్జీ, కేసీఆర్, థాకరే వంటి వారు నాయకత్వం వహించడం పట్ల వామపక్షాలకు కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లు చెబుతున్నారు. వామపక్షాలు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.
కేసీఆర్ ముంబైలో ఉండగానే ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని బాధ్యతలు స్వీకరిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని డీఎంకే రాజ్యసభ సభ్యుడు టీకేఎస్ ఇళంగోవన్ పేర్కొనడం గమనార్హం. డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్న స్టాలిన్ దేశానికే మార్గదర్శకుడయ్యాడని, దేశప్రజల గురించి ఆలోచిస్తు న్న ఆయన ప్రధాని బాధ్యత లు స్వీకరించాలని ప్రజలు ఇష్టపడుతున్నారని ఇళంగోవన్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సహితం అటువంటి ఆకాంక్షలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. ఆమె గత ఏడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక వేదికపైకి తీసుకు రావడం కోసం కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. తమ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారింపనున్నట్లు కూడా చెప్పారు.
మమతా సహితం కాంగ్రెస్ తో దోస్తీకి ఇష్టపడటం లేదు. కానీ, స్టాలిన్, థాకరే ప్రభుత్వాలలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉండడంతో వారిద్దరూ ఆ పార్టీ లేని కూటమి గురించి ఆలోచించే అవకాశం కూడా తక్కువే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ అనుచితంగా మాట్లాడారని అంటూ సానుభూతి వాఖ్యలు పలకడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సానుకూల సందేశం పంపే ప్రయత్నం చేసారు.
అయితే తెలంగాణాలో కేసీఆర్ గద్దె దిగితే అధికారంలోకి వచ్చెడిది తామే అనుకుంటున్న కాంగ్రెస్ కు కేసీఆర్ తో కూటమి ఏర్పాటు ఆత్మహత్య సాదృశ్యమే కాగలదు. మరోవంక, కాంగ్రెస్ సహితం తమ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీలు పనిచేయాలని కోరుకుంటున్నది. అంతే గాని మరో కూటమి ఏర్పాటుకు సుముఖంగా లేదు. ఈ పరిస్థితులలో కేసీఆర్ జాతీయ రాజకీయాలు, మరో బిజెపి వ్యతిరేక కూటమి గురించి మాట్లాడటం ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప మరొకటి అయ్యే అవకాశం కనిపించడం లేదు.