ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు, డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం అధికార పార్టీ వర్గాలలో కలకలం రేపుతున్నది.
అతని వాంగ్మూలం ఆధారంగానే జగన్ మోహన్ రెడ్డి మరో బాబాయి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సిబిఐ తన చార్జిషీట్ లో పేర్కొనడంతో రాబోయే రోజులలో రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
వైఎస్ వివేకాహత్య కేసు నిందితుల్లో ఏ4గా ఉన్న డ్రైవర్ దస్తగిరి ఇప్పుడు సీబీఐకి కీలక వ్యక్తిగా మారాడు. నవంబర్ 26న దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి కడప కోర్టు అనుమతినిచ్చింనా, సహచర నిందితులు, కొందరు అధికారపార్టీ నేతలు వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించడం తెలిసిందే.
వివేకా హత్యకేసులో నిందితులు ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డిలు కడప కోర్టు తీర్పును సవాల్ చేస్తు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. హైకోర్టు కూడా కింద కోర్టు తీర్పును సమర్దిస్తూ నిందితులు వేసిన పి టిషన్లను కొట్టివేయడంతో దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి లైన్ క్లియర్ అయింది.
గత ఏడాది ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి తొలిసారి మేజిస్ట్రేట్ ముందు 164 కింద వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. తాజాగా రెండోసారి కూడా పులివెందుల కోర్టులో వాంగ్మూలం నమోదు చేయించడంతో రాజకీయ వర్గాలలో ఆందోళన కలుగుతున్నట్లు తెలుస్తున్నది. ఆ వాంగ్మూలంలో ఏమి చెప్పాడో ఇంకా బైటకు రాలేదు.
ఈ సందర్భంగా ఎవ్వరెవ్వరి పేర్లు బైటకు వచ్చాయో అని కొందరు అధికార పార్టీ నేతలు, వివేకాహత్యకేసులో ఇంకా విచారణను ఎదుర్కొంటున్న అనుమానితులు కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పేర్లు కూడా మొదటి వాంగ్మూలంలోనే తెరపైకి రావడం గమనార్హం.
తాజా వాంగ్మూలం ఆధారంగా మరికొందరి అనుమానితులను సీబీఐ అధి కారులు అరెస్ట్ చేస్తారని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడున్న 5 గురు నిందితులే కాకుండా వివేకా హత్య కేసులో నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే వైఎస్ హత్య కేసు పులివెందుల కోర్టు నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యింది. సీబీఐ అధికారుల అభ్యర్థన మేరకు కేసును కడప జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది.
ఇక నుంచి వివేకా హత్య కేసు విచారణ, రిమాండ్, వాయిదాలు, బెయిలు అంశాలు అన్నీ కడప జిల్లా కోర్టులోనే జరిగే విధంగా ఆదేశించారు. పులివెందుల కోర్టుకు హాజరైన నలుగురు నిందితులకు సీబీఐ అభియోగ పత్రాల వివరాలను మెజిస్ట్రేట్ తెలియజేశారు.
కాగా, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని అధికారి రాంసింగ్‌పై ఏకంగా కేసు నమోదు అయ్యింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో తాము చెప్పినట్లుగానే చెప్పాలని రాంసింగ్ బెదిరిస్తున్నారని ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కడప రిమ్స్ స్టేషన్లో మంగళవారం రాంసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవంక, వివేకానందరెడ్డి హత్య కేసులో శివగామి ఎవరని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంకొంతమంది పేర్లు తాజా వాంగ్మూలంలో ఉండొచ్చని తెలిపారు. సీబీఐ ఛార్జ్ షీట్లో ఉన్న వారిని వారం రోజుల్లో విచారణకు పిలిచే అవకాశం ఉండొచ్చని చెప్పారు.