ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరగనున్న నాలుగో దశ పోలింగ్ మొత్తం ఏడు దశల ఎన్నికల సరళిని, ఫలితాలను నిర్ధేశించే అవకాశం ఉంది. మొదటి మూడు దశలలో పుంజుకున్న సమాజవాద్ పార్టీ ఈ దశలో నెగ్గుకు రాగలిగితే, ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవంక, నలుగురు కేంద్ర మంత్రులకు ఈ దశ ప్రతిష్ఠాత్మకంగా మారింది.
మొదటి మూడు దశలలో మొత్తం 403 స్థానాల్లో 172 స్థానాలకు దాదాపు ముఖాముఖీ పోటీ వలే బీజేపీకి, ఎస్పీల మధ్య జరిగాయి. అయితే ఈ సారి బహుముఖ పోటీలు ఉన్నాయి. మిగిలిన మూడు దశలు సహితం అదే విధంగా ఉండే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో 59 స్థానాలకు జరుగుతున్న ఈ దశ ఎన్నికలు.. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అజయ్ మిశ్రా, స్మృతీ ఇరానీ, కౌశల్ కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కుటుంబ ప్రాబల్యం ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గం ఆ పార్టీ పరువును కాపాడుతుందా? లేదా? అన్నది కూడా ఆసక్తిగా మారింది.
2017 ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న 51 స్థానాలను నిలబెట్టుకోవడం ఈసారి అంత సులభం కాదని పరిశీలకులు అంటున్నారు. నాలుగో దశ పోలింగ్ జరగనున్న అత్యధిక ప్రాంతాల్లో రైతుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రీత్యా బీజేపీ ప్రభంజనానికి అడ్డుకట్ట పడక తప్పదని తెలుస్తోంది.
ప్రధానంగా లఖీంపూర్ ఖీరీ ప్రాం తంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా.. వాహనం నడిపి నలుగురి మరణానికి కారణమైనా బెయిల్ దక్కడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాగా, మరో సీనియర్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లఖ్‌నవూలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
గత ఎన్నికల్లో వీటిలో బీజేపీ 8 సీట్లను దక్కించుకుంది. కానీ, ఈసారి కమలం అభ్యర్థులకు ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. ఇక మరో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ లోక్‌సభ నియోజకవర్గమైన మోహన్‌లాల్ గంజ్ పరిధిలోని మలిహాబాద్ నుంచి ఆయన సతీమణి జయ్దేవి పోటీ చేస్తున్నారు. అక్కడ సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి నుంచి సవాలు ఎదురవుతోంది.
పోటీలో ఉన్న ప్రముఖులలో లక్నో కాంట్ నుండి యుపి ప్రభుత్వంలో న్యాయ మంత్రి బ్రిజేష్ పాఠక్ ఉన్నారు. అశుతోష్ టాండన్, మరొక మంత్రి, లక్నో తూర్పు నుండి దివంగత లాల్జీ టాండన్ కుమారుడు; రాజేశ్వర్ సింగ్, లక్నోలోని సరోజినీ నగర్‌కు చెందిన మాజీ ఈడీ అధికారి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అభిషేక్ మిశ్రా ఉన్నారు.
యుపి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ నరేష్ అగర్వాల్ కుమారుడు నితిన్ అగర్వాల్ కూడా ఉన్నారు; అదితి సింగ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాయ్ బరేలీ సదర్ నుండి బిజెపి అభ్యర్థి. సిఎఎ వ్యతిరేక ఉద్యమకారుడు సదాఫ్ జాఫర్‌ల క్నో సెంట్రల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్ ఉన్నావ్ సదర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి. హర్దోయ్‌లోని శాండిలా నుండి బీఎస్పీ నాయకుడు, మాజీ మంత్రి అబ్దుల్ మన్నన్ పోటీ చేస్తున్నారు.
మొదటి మూడు దశలలో బిజెపికి బలమైన పట్టణ ప్రాంతాలలో తన మద్దతు దారులను ఎక్కువగా పోలింగ్ చేసుకోలేక పోయిన బిజేపికి ఎక్కువగా పట్టణ ప్రాంతాలున్న ఈ దశ ఎన్నికలు ఒక విధంగా సవాల్ గా పరిణమించాయి. అయితే మొదటి మూడు దశలలో జరిగిన నష్ఠాలను అవధ్. బుందేల్‌ఖండ్ ప్రాంతాలలో భర్తీ చేసుకోగలమని బిజెపి ధీమాతో ఉంది.
సమాజ్‌వాదీ పార్టీ 58 స్థానాల్లో పోటీ చేయగా, దాని మిత్రపక్షమైన ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన ఎస్‌బిఎస్‌పి మిగిలిన రెండింటిలో అభ్యర్థులను నిలబెట్టింది. బిజెపి 57 స్థానాల నుండి అభ్యర్థులను నిలబెట్టింది. దాని మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) మిగిలిన మూడు స్థానాలకు పోటీలో ఉంది. బీఎస్పీ, కాంగ్రెస్‌లు 60 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.