సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకుపైగా సమయం ఉండగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సన్నాహాలు ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ఇటీవల గత మూడేళ్ళుగా ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులను బదిలీ చేసి, కొత్తవారిని నియమించడం `ఎన్నికల బృందం’ను ఏర్పాటు చేసుకోవడంగా పలువురు భావిస్తున్నారు.
సిఎం ప్రిన్సిపాల్ కార్యదర్శి, డిజిపి, నిఘా అధిపతి వంటి వారిని ఒకేసారి మార్చడం గమనార్హం. పార్టీ ఎమ్యెల్యేలు, మంత్రుల పనితీరుపై ప్రజల మనోభావాలను తెలుసుకోవడం కోసం విస్తృతంగా సర్వేలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. మరోవంక, ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై కూడా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తున్నది.
గతంలో వలే మేనిఫెస్టో రూపకల్పనలో ఉద్యోగ విరమణ చేసిన సీనియర్ అధికారుల సేవలను వినియోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఆర్ధిక వ్యవహారాలను చక్కదిద్దడంతో పాటు, సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చేవిధంగా నిపుణుల అభిప్రాయం సేకరిస్తున్నట్లు తెలిసింది.
2019లో తయారు చేసిన మ్యానిఫెస్టోలో ఆర్ధికశాఖలో దీర్ఘకాలం పనిచేసి, తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసి పదవీ విరమణ చేసిన అజేయకల్లాం కీలకంగా వ్యవహరించారు. ఈసారి ఆయన కొరత నిర్లిప్తంగా ఉండటంతో అంత చొరవ చూపే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ సందర్భంగా కొనాుళ్లు సిఎంఓలో పనిచేసి బయటకు వెళ్లిన పి.వి రమేష్ పేరు తెరపైకి వస్తున్నది.
అయితే, ఆయన అనాసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వ సలహాదారునిగా నియమించినా అకస్మాత్తుగా ఆయనకు ఏపని లేకుండా చేయడంతో రాజీనామా చేసి వెళ్లడం తెలిసిందే. దానితో మరో అధికారికి అన్వేషిస్తున్నట్లు అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గతంలో వలే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చినా, ప్రభుత్వంపై అంతగా ఆర్ధిక భారం పడకుండా ఏ విధంగా చేయాలో అని కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవంక, ప్రశాంత్ కిషోర్ బృందం ఎటూ మేనిఫెస్టో రూపకల్పనతో పాటు ఎన్నికల సన్నాహాలు విషయంలో కీలక పాత్ర వహింపనున్నది.