ఉత్తర ప్రదేశ్ లో చెప్పుకోదగిన బలం లేకపోయినా సుమారు 100 సీట్లలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో వెనుక ఉంది నడిపిస్తున్నది బిజెపి అని, ముస్లిం ఓట్లను చీల్చడం కోసం ఈ ఎత్తుగడ వేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీహార్, పశ్చిమ బెంగాల్ లో కూడా ఆ విధంగానే ఆరోపించగా, బీహార్ లో ఆర్ జె డి అధికారం చేజిక్కించుకోలేక పోవడంలో ఒవైసి కీలక పాత్ర వహించారు. అయితే బెంగాల్ లో ఆయన ఎత్తుగడలు సాగలేదు.
ఉత్తర ప్రదేశ్ లో ఒవైసి పాత్ర ఏమైనా, ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా గట్టి గట్టి పోటీదారునిగా ఉంటూ వచ్చిన
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ పర్యాయం ఒక విధంగా మౌనంగా ఉండడం, మరోవంక ఎట్టి పరిస్థితులలో సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని ధీమా వ్యక్తం చేస్తుండడం చూస్తుంటే ఆమె వ్యూహాత్మకంగా బిజెపి తిరిగి గెలుపొందడానికి సహకరిస్తున్నారని అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి.
ఈ మధ్య కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, మాయావతి చేసిన ప్రకటనలు సహితం అటువంటి అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ తన పార్టీ పట్ల వాస్తవ దృక్పథాన్ని ప్రదర్శించడం ఆయన ఔన్నత్యమని అమిత్ షా గత వారం ఓ చానల్‌కు ఇంటర్వ్యూ లో బీఎస్పీకి కొన్ని దళిత, ముస్లిం ఓట్లు వెళ్ళడం వల్ల ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రయోజనం పొందుతుందా? అని అడిగినపుడు స్పందిస్తూ, దీనివల్ల బీజేపీకి లాభమా? నష్టమా? అనేది తనకు తెలియదని చెప్పారు.
నియోజకవర్గాన్నిబట్టి ఇది ఉంటుందని చెబుతూ. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి పని అయిపోయిందనడం సరైనది కాదని స్పష్టం చేశారు. ఆమె ప్రచారం స్థాయి తక్కువగా కనిపించినంత మాత్రానికి ఆమెకుగల యావత్తు మద్దతు తుడిచిపెట్టుకుపోయిందని భావించకూడదని హెచ్చరించారు.
బీఎస్పీ సత్తాను అమిత్ షా సానుకూలంగా అంచనా వేయడంపై స్పందించాలని విలేకర్లు కోరినపుడు మాయావతి మాట్లాడుతూ, వాస్తవాన్ని గుర్తించడం ఆయన పెద్దరికమని కొనియాడారు. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో తమ పార్టీ బీఎస్పీకి దళితులు, ముస్లింలు మాత్రమే కాకుండా అగ్ర వర్ణాలు, వెనుకబడిన తరగతులకు చెందినవారు కూడా ఓట్లు వేశారని ఆయనకు చెప్పాలనుకుంటున్నాను ఆమె తెలిపారు. .
రాష్ట్రంలోని 403 స్థానాల్లో 300కు పైగా స్థానాలను గెలుచుకుంటామని బీజేపీ చెప్తుండటంపై స్పందిస్తూ, కాలమే సమాధానం చెప్తుందని ఆమె దాటవేసేరు. బీజేపీ, “సమాజ్‌వాదీ పార్టీలకు బదులు బీఎస్పీయే విజయం సాధించవచ్చు, ఎవరికి తెలుసు? సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా, గూండారాజ్ ఉంటుండి” అంటూ నర్మగర్భంగా చెప్పారు. అయితే ఆమె అభ్యర్థులను నిలబెట్టిన తీరు చూస్తుంటే ఆమె కేవలం సమాజవాద్ అభ్యర్థుల ఓట్లను చేర్చడం ద్వారా బిజెపి అభ్యర్థులకు ప్రయోజనం కలిగించే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
బిఎస్పి నిలబెట్టిన అభ్యర్థులను పరిశీలిస్తే ఆ పార్టీ బిజెపి కంటే ఎక్కువ సీట్లలో ఎస్పిని దెబ్బతీయవచ్చని అర్ధం అవుతుంది. ఎస్పి తన మొత్తం ముస్లిం, యాదవ్ మద్దతుతో పాటు ఇతర వర్గాల నుండి అదనపు ఓట్లను కూడగట్టుకోవడం ద్వారా బిజెపి కంటే ముందంజ వేయాలని చేస్తున్న ప్రయత్నంకు గండికొట్టే ఎత్తుగడ కనిపిస్తుంది. నీసం 28 స్థానాల్లో బీఎస్పీ, ఎస్పీ కూటమి ముస్లిం అభ్యర్థులను నిలబెడుతున్నాయి.
ఈ సీట్లలో ఎక్కువ భాగం పశ్చిమ యుపిలో ఉన్నాయి. ఇక్కడ ముస్లిం, జాట్ ఓట్లను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఆర్ఎల్డితో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఆధిపత్యం వహించే ఎస్పి ప్రయత్నంకు ఒక విధంగా ముప్పు కాగలదు.
403 స్థానాలకు గాను బిఎస్పి 88 మంది, ఎస్పి 61 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెడుతున్నారు. 2017లో, బిఎస్పి 100 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టినప్పుడు, కేవలం నలుగురు మాత్రమే గెలవగలిగారు.
కాగా, 44 స్థానాల్లో, ఎస్పి ముస్లిమేతర అభ్యర్థులపై బిఎస్పి ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది. ఎస్పి కూటమికి ముస్లింలు అత్యధికంగా ఓటు వేస్తున్నట్లు భావిస్తుండగా, బిఎస్పి బలమైన ముస్లిం అభ్యర్థి ఉన్న స్థానాల్లో వారి ఓట్లలో విభజన అనివార్యమని రెండు పార్టీలు అంగీకరిస్తున్నాయి.
ఆరు స్థానాల్లో ముఖ్యంగా షేఖుపూర్, అలీగంజ్, ఛిబ్రామౌ, బక్షి కా తలాబ్, కుందా, గైన్సారి లలో బీఎస్పీ ముస్లిం అభ్యర్థులు ఎస్పీ యాదవ్ అభ్యర్థులను దెబ్బతీసే అవకాశం ఉంది. యాదృచ్ఛికంగా, బిఎస్పి కూడా కొన్ని స్థానాల్లో యాదవ్ అభ్యర్థులను నిలిపింది. మార్చి 7న చివరి దశలో ఎన్నికలకు వెళ్లే మల్హానీ లో ఇద్దరు యాదవులనే పోటీకి దింపారు. దానితో యాదవ్‌ల ప్రాబల్యం ఉన్న స్థానంలో తమ ఠాకూర్ అభ్యర్థికి విజయావకాశం అవకాశం ఉండగలదని బీజేపీ అంచనా వేస్తున్నది.
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై బ్రాహ్మణులు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు ఆశ్చర్యకరంగా బిజెపి కంటే తక్కువ బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టాయి. బిజెపి, మిత్రపక్షాలు నిలబెట్టిన 62 మంది బ్రాహ్మణ అభ్యర్థులతో పోలిస్తే, బిఎస్పి 54, ఎస్పి కూటమి 34 , కాంగ్రెస్ 48 మందిని పోటీకి దింపాయి. గతసారి బిఎస్పి 62 మంది బ్రాహ్మణులను నిలబెట్టగా నలుగురు విజయం సాధించారు.
దశాబ్ద కాలంగా రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలో లేకపోయినా, వరుసగా జరిగిన ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని నిలబెట్టుకుంటున్నది. 2007లో, దాని విజయవంతమైన సోషల్ ఇంజినీరింగ్, అగ్ర కులాలు, ముస్లింలను దాని సాంప్రదాయ ఓటు బ్యాంకుకు జోడించి, ఊహించని విధంగా మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించింది.
బిఎస్పి అభ్యర్థుల కారణంగా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న వారిలో ఎస్పి అభ్యర్థిగా ఫాజిల్‌నగర్ పదరునా నుండి పోటీ చేస్తున్న బిజెపి మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కూడా ఉన్నారు. అతనితో బీఎస్పీకి చెందిన ఇలియాస్ అన్సారీ, బీజేపీకి చెందిన సురేంద్ర కుష్వాహా పోటీపడుతున్నారు. స్వామి ప్రసాద్‌కు ఎస్పీ టికెట్ ఇవ్వడంతో ఎస్పీ కార్యకర్త అన్సారీ పార్టీని వీడారు. అన్సారీని రంగంలోకి దింపేందుకు బీఎస్పీ ఇక్కడి నుంచి తన బ్రాహ్మణ అభ్యర్థిని దించింది.
ఎస్పీ మిత్రపక్షమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నాయకుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్ పోటీ చేస్తున్న జహూరాబాద్లో బీఎస్పీ మాజీ ఎస్పీ నేత షాదాబ్ ఫాతిమాను పోటీకి దింపింది. రాబోయే దశల్లో ఓటు వేసే బహ్రైచ్‌లో, ఎస్పీకి చెందిన యాసర్ షాతో బీఎస్పీకి చెందిన నయీమ్ పోటీపడుతున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్.
అదేవిధంగా, గోరఖ్‌పూర్‌లో ఆదిత్యనాథ్‌తో సహా, సిరతులో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య , రాయ్‌బరేలీలో బిజెపికి చెందిన అదితి సింగ్‌తో సహా బిజెపి అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చడానికి బిఎస్పి అభ్యర్థులను ఎంపిక చేసిన్నట్లు స్పష్టం అవుతున్నది.