రాష్ట్రంలో రాజకీయంగా ప్రతిపక్షం కన్నా పెను ప్రమాదంగా భావించడం వాళ్ళనయితేనేమి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి, బీజేపీ నేతలకన్నా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం చర్యలపై దూకుడుగా స్వరం వినిపిస్తుండడం వల్లనైతే నేమి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పట్ల కలత చెందుతున్నట్లు కనిపిస్తున్నది.
జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో చెప్పుకోదగిన యంత్రాంగం లేకపోయినప్పటికీ ఆయన లేవనెత్తుతున్న అంశాలపట్ల ప్రజలనుండి తీవ్రమైన స్పందన వస్తుండడంతో ఖంగారు పడుతున్నట్లు కనిపిస్తున్నది. అందుకనే వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ లేకుండా టిడిపి గాని, బిజెపి గాని ఎన్నికలలో పోటీచేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక, ఆయన నటించిన సినిమా విడుదలపై ఆ ఆగ్రహం చూపించడం వైసిపి నేతలు పలువురికి సహితం మింగుడు పడటం లేదు. పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన `భీమ్లానాయక్’ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కక్షసాధింపు ధోరణులను వెల్లడి చేస్తున్నట్లు అధికార పార్టీకి మద్దతుదారులు సహితం భావిస్తున్నారు.
మొత్తం రెవిన్యూ యంత్రాంగాన్ని సమీకరించి, ఆ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద అధిక రేట్లకు టిక్కెట్లు అమ్మవద్దంటూ హడావుడి చేసిన కృష్ణా జిల్లాలో తప్ప రాష్ట్రంలో పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ నవ్వులపాలయ్యారని కొందరు మంత్రులు సహితం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా ఆ సినిమాకు జగన్ అనవసరపు ప్రచారం కల్పించారని వాదన కూడా వినిపిస్తోంది.
తాజాగా ప్రభుత్వ ధోరణిపై మండిపడుతూ రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి గాని, సినిమాపై ప్రతాపం చూపడం ఏమిటని అంటూ ప్రముఖ నటుడు ప్రకాజ్ రాజ్ ధ్వజమెత్తారు. `సృజన, సాంకేతికత మేళవించిన సినిమారంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి?
చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ.. మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మలా? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి’ అంటూ ఒక ట్వీట్ లో వైసిపి ప్రభుత్వంకు హితవు చెప్పారు. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు? ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డకట్ట వేయలేదని అంటూ ఏపీ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.
ప్రభుత్వ ధోరణిపై పవన్ కళ్యాణ్ మాత్రం పెదవి విప్పలేదు. అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ప్రభుత్వంపై విరుచుకు పాడడం ద్వారా జగన్ వ్యవహారశైలి రాజకీయ వివాదంగా మారడానికి దారితీసింది. ఒక విధంగా పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా దగ్గరకు చేర్చేందుకు దారితీస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.