ఉక్రెయిన్నుంచి పొరుగుదేశాలకు వలస వెళ్లిన భారతీయులను వెనక్కి తీసుకు రావడం కోసం ప్రభుత్వం రాబోయే మూడు రోజుల్లో 26 ప్రత్యేక విమానాలను నడుపుతుందని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా చెప్పారు. ఉక్రెయిన్నుంచి భారతీయులను తీసుకువచ్చే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రింగ్లా ఈ విషయం తెలిపారు.
ప్రభుత్వం తొలి అడ్వైజరీ జారీ చేసిన సమయంలో ఉక్రెయిన్‌లో దాదాను 20 వేల మంది భారతీయులు ఉన్నట్లుగా అంచనా వేశాం. వీరిలో దాదాపు 12 వేల మంది ఉక్రెయిన్ వదిలి వెళ్లారు. అంటే ఉక్రెయిన్‌లో ఉన్నం మొత్తం భారతీయుల్లో ఇది 60 శాతం అని హర్షవర్ధన్ చెప్పారు.
కాగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో 616 మంది నాలుగో రోజు స్వదేశానికి చేరుకున్నారు. రొమేనియా రాజధాని బుచారెస్ట్, హంగేరీ రాజధాని బుడపెస్ట్ నుంచి ఇండిగో, టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లకు చెందిన మొత్తం మూడు విమానాల ద్వారా మంగళవారం వీరు భారత్‌కు చేరుకున్నారు.
ఉక్రెయిన్ పొరుగు దేశాల మీదుగా భారతీయులను తరలించే కార్యక్రమం ఫిబ్రవరి 26న ప్రారంభం కాగా, ఇప్పటివరకు భారత్ ప్రైవేట్ విమానాల ద్వారా 2012 మంది స్వదేశానికి తరలివచ్చారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారతీయులెవరూ మిగలలేదని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ప్రింగ్లా తెలిపారు. ‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పలువురు భారతీయ విద్యార్థులు, పౌరులను కేంద్రం తరలిస్తున్న సంగతి తెలిసిందే.
ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన విద్యార్థులకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘన స్వాగతం పలుకుతూ, వారితో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. బాంబుల మోతతో ఉక్రెయిన్ దద్దరిల్లుతున్నా..ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించారని ఆమె కొనియాడారు. “మీ కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారని..మీ రాకతో వారి కళ్లల్లో ఆనందం వెల్లువిరుస్తుంది” అని చెప్పారు.
స్వదేశానికి తిరిగి రావడంతో ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థులు చెప్పారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న మిగతా వారిని కూడా స్వదేశానికి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. క్షేమంగా భారత్ కు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు.
ఇలా ఉండగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని మూసి వేశారని, భారత రాయబారి, దౌత్య సిబ్బంది అంతా కూడా దేశంలోని పశ్చిమ ప్రాంతానికి వెళ్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కీవ్‌పై రష్యా దాడి తూర్పు ప్రాంతంనుంచి జరుగుతుండడంతో, భారత్ తన విద్యార్థులను పశ్చిమ సరిహద్దులకు వెళ్లాల్సిందిగా సలహా ఇస్తుండడం తెలిసిందే. కీవ్‌లోని భారతీయులంతా కూడా నగరం వదిలి వెళ్లిన తర్వాత కీవ్‌లోని భారత దౌత్యా కార్యాలయాన్ని మూసి వేయడం గమనార్హం.