బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల కుట్రతో అనుసంధానించడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో కనుగొన్నట్లు తెలుస్తున్నది. అలాగే, ఖాన్ అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌లో భాగమని నిరూపించడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవని ఆ వర్గాలు తెలిపాయి.
గోవాకు వెళ్లే కోర్డెలియా యాచట్పై జరిపిన దాడిలో కొన్ని అక్రమాలు జరిగాయని మాత్రమే అధికార వర్గాలు చెప్పగలుగుతున్నాయి. ఆ అంశాన్ని సిట్ ఇంకా పరిశీలిస్తోంది.
అప్పటి ముంబై జోన్ హెడ్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సిబి బృందం కార్డెలియా క్రూయిజ్ యాచ్‌పై అక్కడ అక్టోబర్ 2 , 3 మధ్య రాత్రి మాదకద్రవ్యాల పార్టీ జరుగుతుండగా దాడి చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్యన్ ఖాన్ ,మరికొందరిని మాదక ద్రవ్యాల కుట్ర, డ్రగ్స్ సేవించిన ఆరోపణలపై బృందం అదుపులోకి తీసుకుంది.
ఖాన్‌ను ఎన్‌సిబి బృందం అక్టోబర్ 3న అరెస్టు చేసింది. విచారణ తర్వాత, అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అతని మొదటి బెయిల్‌ను ట్రయల్ కోర్టు కొట్టివేసింది. తర్వాత, ఖాన్ తన న్యాయవాది ద్వారా, బాంబే హైకోర్టును ఆశ్రయించాడు, అది అతనికి అక్టోబర్ 28న బెయిల్ మంజూరు చేసింది. న్యాయపరమైన ప్రక్రియల కారణంగా, అక్టోబర్ 30న జైలు నుండి విడుదలయ్యాడు.
ఇప్పటి వరకు ఇద్దరు నైజీరియన్లు సహా 20 మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఎన్‌సిబి సిట్ ఈ విషయంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం కోసం ప్రస్తుతం న్యాయ అభిప్రాయాన్ని కోరుతున్నట్లు తెలిసింది. కాగా, అప్పట్లోనే ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై పలు విమర్శలు చెలరేగాయి. కీలక సూత్రధారులను వదిలివేసి, కేవలం రాజకీయ కారణాలతో అరెస్ట్ చేసారంటూ పలువురు మహారాష్ట్ర మంత్రులు ఆరోపించారు.