వివేకా నందరెడ్డి హత్య కేసు విచారణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం లేదని మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఆ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, నిజాల్ని బయటకు తీసి దోషులకు శిక్షపడేలా చూడాలని సిఎం తనకు ఎప్పుడూ చెప్పేవారని ఆయన తెలిపారు.
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి డిజిపిగా ఉన్న సమయంలో తాను మాట్లాడానంటూ కొన్ని వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చాయని, అందులో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి, అవినాశ్‌రెడ్డిల కుటుంబాలు తనకు రెండు కళ్లులాంటివని మాత్రమే సిఎం తనకు చెప్పారని అందులో వివరించారు. సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి 2019 సెప్టెంబరులో తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు.
అదే సమయంలో అమాయకులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆయన తనతో చెప్పారని కూడా వారికి తెలియజేశానని పేర్కొన్నారు. తదనంతరం ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులు, వాస్తవాలను కోర్టు ముందుంచాలని సీఎం జగన్ తమకు స్పష్టంగా నిర్దేశించారని తెలిపారు.
సక్రమంగా దర్యాప్తు చేయడమే కాకుండా అదే విశ్వాసాన్ని అందరిలోనూ కల్పించాలని సీఎం నిర్దేశించారని ఆయన చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో ఏ దశలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. అదే విధంగా, తాను డిజిపిగా ఉన్నప్పుడు ఏనాడూ అవినాశ్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి తనను కలవలేదని సవాంగ్ తెలిపారు.
కాగా, వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసులో ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారమే టీడీపీ నేతలు తొలుత ఎంపీ అవినాష్‌రెడ్డి పైన, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన నిందలు మోపుతున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆరోపించారు.
వివేకా హత్య కేసులో టీడీపీ, ఎల్లో మీడియా ఒక పథకం ప్రకారం రోజుకోరకంగా కథనం రచించి, రోజుకో టీడీపీ నాయకుడితో మాట్లాడిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ కేసులో బీటెక్ రవి, రాజశేఖర్, టీడీపీ ప్రోద్బలంతో బీజేపీలో చేరిన ఆదినారాయణరెడ్డిపై ఎందుకు నిందలు మోపడం లేదని ప్రశ్నించారు.
కాగా, సిబిఐ వెల్లడిస్తున్న పలు సాక్షుల కధానాలలో అవినాష్ రెడ్డి కీలక నిందితుడిగా ఆరోపణలు వస్తుండటం, మొత్తం సూత్రధారి ముఖ్యమంత్రి జగన్ అంటూ టిడిపి నేతలు ఆరోపణలు చేస్తుండడంతో సవాంగ్ ప్రకటన ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.