ఆధ్యాత్మికత ఆయుధంగానే విశ్వశాంతికి, సర్వమానవ సౌభ్రాతత్వానికి భారతదేశం బాటలు వేయనుందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వేదకాలం నుంచి ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన సూచించారు.
విజయవాడలో శ్రీ జగన్నాథ స్వామి తత్వాలను వివరిస్తూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కుమారుడైన ప్రసేన్ జిత్ హరిచందన్ నేతృత్వంలోని ‘డివైన్ క్యాప్సూల్’ సంస్థ తీసుకొచ్చిన ‘జగన్నాథాష్టకం’ సీడీని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు పూరీ సందర్శన సందర్భంగా విష్ణు రూపమైన జగన్నాథుడి లీలా వినోదాన్ని కీర్తిస్తూ ఈ జగన్నాథాష్టకం పఠించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
భారతదేశం అపారమైన ఆధ్యాత్మిక సంపదకు నిలయమని, అలాంటి ఆధ్యాత్మిక భావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని మానసిక ప్రశాంతతను పొందాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఇళ్లలోనుంచి బయటకు రాలేని సందర్భంలో చాలా మంది శారీరక ఆరోగ్యం కోసం యోగ, మానసిక ఆరోగ్యానికి ధ్యానం, ఆధ్యాత్మికత మార్గాన్ని అనుసరించారని గుర్తు చేశారు.
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సంతులనంలో ఉంచుకోవడం అవసరమవుతోందన్న ఉపరాష్ట్రపతి ఇందుకోసం ఆధ్యాత్మికతే సరైన మార్గమని ఉపరాష్ట్రపతి చెప్పారు. స్వామి జగన్నాథుడికి ఒడిశాతోపాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కుల, ప్రాంతాలకు అతీతంగా భక్తులున్నారని తెలిపారు.
సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కూడి పురీ కేంద్రంగా భక్తులకు సౌభ్రాతత్వాన్ని జగన్నాథుడు బోధించిన అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని.. మన సమాజంలోనూ ఇదే భావనతో శాంతి, సామరస్యాలు పెంపొందించేందుకు కృషిచేయాలని సూచించారు. ఈ సీడీని తీసుకురావడంలో శ్రమించిన ప్రసేన్ జిత్ హరిచందన్, గాయకుడు సురేశ్ వాడేకర్, సంగీత దర్శకుడు జగ్యాన్ దాస్ తో పాటు తెరవెనక శ్రమించిన ప్రతి ఒక్కరినీ ఉపరాష్ట్రపతి పేరు పేరునా అభినందించారు.