పశ్చిమ బెంగాల్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికలలో 102 మునిసిపాలిటీలను గెలుచుకున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికలు, తదుపరి అసెంబ్లీ ఉపఎన్నికలు, కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత, మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ స్థానిక సంస్థలలో మెజారిటీ మున్సిపాలిటీలను గెలుచుకోవడం ద్వారా తన పట్టును బలోపేతం చేసుకుంది.
టీఎంసీ గెలిచిన 102 పురపాలక సంఘాలలో 31 మున్సిపాలిటీల్లో ప్రతిపక్షం లేదు.నదియా జిల్లాలోని తాహెర్‌పూర్ మున్సిపాలిటీలో లెఫ్ట్ ఫ్రంట్ విజయం సాధించింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకుని పశ్చిమ బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆశ్చర్యకరంగా, కొత్తగా ఏర్పడిన హమ్రో పార్టీ డార్జిలింగ్ మునిసిపాలిటీని గెలుచుకుంది.
టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ తన పార్టీకి భారీ అధికారాన్ని అందించినందుకు ప్రజలను అభినందించారు. “మా-మతి-మనుష్కి మరో అద్భుతమైన ఆదేశం ప్రకారం హృదయపూర్వక కృతజ్ఞతలు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులకు అభినందనలు. విజయం మన బాధ్యత, అంకితభావాన్ని పెంపొందింప చేస్తుంది. విజయం వినయాన్ని అందించనివ్వండి. రాష్ట్ర శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి కోసం కలిసి పని చేద్దాం. జై బంగ్లా!” బెనర్జీ ట్వీట్లో పేర్కొన్నారు.
నాలుగు మున్సిపాలిటీలు-ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగా, హుగ్లీ జిల్లాలోని చంపదానీ, పురూలియా జిల్లాలోని ఝల్దా, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని ఎగ్రా- హంగ్ పరిస్థితిని ఎదుర్కొంది. మరోవైపు, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కొంటాయి మున్సిపాలిటీలో టిఎంసి మాజీ నాయకుడు సువేందు అధికారి బిజెపికి ఫిరాయించినప్పటికీ అధికారాన్ని నిలుపుకుంది.
డార్జిలింగ్‌లో ప్రజాస్వామ్యం పునరుజ్జీవం
ఇదిలా ఉండగా, ఉత్తర బెంగాల్ పర్వత రాజకీయాలలో కొత్తగా ప్రవేశించిన హమ్రో పార్టీ డార్జిలింగ్ మున్సిపాలిటీని గెలుచుకుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా, డార్జిలింగ్ పరిసర ప్రాంతంలో ఆదివారం జరిగిన పోలింగ్‌లో ఎలాంటి హింసాకాండ జరగలేదు.
ఈ ఫలితం గురించి స్పందిస్తూ, డార్జిలింగ్‌లో ప్రజాస్వామ్యం పునరుజ్జీవం పొందినందుకు సంతోషంగా ఉందని మమతా తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు పార్టీలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. త్వరలో జిటిఎ (గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్) ఎన్నికలు జరుగగలవాని ఆమె ప్రకటించారు.
డార్జిలింగ్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్ యజమాని, సామాజిక కార్యకర్త అయిన అజయ్ ఎడ్వర్డ్ గత ఏడాది నవంబర్‌లో హుమ్రో పార్టీని ప్రారంభించారు, ఇది కొండ ప్రాంత ఓటర్లకు కొత్త అవకాశం ఇచ్చింది. జిజెఎం, జిఎన్ఎల్ఎఫ్ వలె కాకుండా, కొత్త పార్టీ టిఎంసి లేదా బిజెపి లతో పొత్తు పెట్టుకోలేదు. డార్జిలింగ్ సివిక్ బోర్డులోని 32 సీట్లలో 18 స్థానాలను గెలుచుకుంది.