ఇప్పుడు దేశానికి కొత్త దిశానిర్దేశం కావాలనిరు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపిచ్చారు. రాంచీలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో నడవడం లేదు.. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని స్పష్టం చేశారు.
75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశం సరిగ్గా అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. భారత్‌ను సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశాన్ని బాగు చేసేందుకు ఏం చేయాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయని చెబుతూ త్వరలో అందరం కలుస్తామని వెల్లడించారు.
అయితే ప్రస్తుతానికి ఏ ఫ్రంట్ లేదని, ఉంటే చెప్తామని తెలిపారు. .భవిష్యత్తులో ఏమవుతుందో త్వరలో తెలుస్తుందని చెప్పారు. కొత్త దిశానిర్దేశం కోసం పలువురి నేతల్ని కలవడం జరుగుతోందని చెబుతూ కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధముందని చెప్పారు.
తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మద్దతు పలికారని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని, ఇవాళ శిబూ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారని కేసీఆర్ తెలిపారు.హేమంత్ సోరెన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులతో పాటు భవిష్యత్ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ నివాసానికి సీఎం సతీమణి శోభ కూడా వెళ్లారు. భేటీ అనంతరం గల్వాన్ లోయలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందచేశారు.
గతేడాది శత్రువులతో పోరాడుతూ అసువులుబాసిన కుందన్ కుమార్ తో పాటు గణేశ్ హన్సదా కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రితో సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ రాంచీలోని ఉన్న గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.