ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచార సభలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుండి బిజెపి నేతలందరూ ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో నెలకొన్న కుటుంబపాలన గురించి ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. ఈ ప్రచారాన్ని ప్రచారం చివరి దశలో ఎస్పీ నేతలు తిప్పికొట్టేందుకు బిజెపి ప్రముఖుల కుటుంభ సభ్యుల గురించి ప్రశ్నించడం ప్రారంభించారు.
ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఒక టీవీతో మాట్లాడుతూ.. సొంతపార్టీలో కుటుంబ పక్షపాతాన్ని వదిలేసి, బీజేపీ నేతలు తమను తప్పుబడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘ప్రధాని తర్వాతి స్థానంలో ఉన్న హోం మంత్రి అమిత్ షా కొడుకు జయ్ షా అత్యంత శక్తివంతమైన బీసీసీఐ గౌరవ కార్యదర్శి ఎలా అయ్యారు? దగ్గరి బంధువు ఉండటం వల్లనే కదా సీఎం యోగి గతంలో గోరఖ్పూర్ మఠాధిపతిగా ఎదిగారు?’ అని అఖిలేశ్ నిలదీశారు.
గతంలోనే జయ్ షాపై ప్రతిపక్షాలు పలు ఆర్ధిక అక్రమాలకు పాల్పడిన్నట్లు ఆరోపణలు చేస్తూ, విచారణకు డిమాండ్ చేశాయి. బీసీసీఐ ఇప్పుడు మొత్తం షా కనుసన్నలలో నడుస్తున్నదని, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పట్ల బీసీసీఐ అవమానకరంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఆయన పాత్ర కూడా ఉన్నదనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. అంతేకాకుండా, బీసీసీఐని ఒక వ్యాపార సంస్థగా మారుస్తున్నారని అసంతృప్తి వ్యక్తం అవుతున్నది.
కాగా, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరు అత్తలు బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఎవరి కొడుకు? అంటూ అఖిలేష్ ప్రశ్నించారు. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు?’ అని నిలదీశారు. దేశ వ్యాప్తంగా బిజెపి కేటాయిస్తున్న సీట్లలో అనేకమంది పార్టీ ప్రముఖుల కుటుంభం సభ్యులు ఉన్నారని అంటూ ప్రస్తావించారు. ఇక కుటుంభంలో ఇద్దరు, ముగ్గురు అధికార పదవులలో ఉన్నట్లు కూడా చెబుతున్నారు.
అంతకు ముందు ఒక బహిరంగసభలో, ప్రధాని విమర్శలను తిప్పికొడుతూ “బిజెపి వారికి కుటుంబాలు లేవు. వారికి కుటుంబాల ఇబ్బందులు ఏమి తెలుస్తాయి? కుటుంభాలు ఉంటె కదా అధిక ధరలు, నిరుద్యోగం వంటి సమస్యల గురించి తెలిసెడిది. ఈ సభలో ఉన్న వారందరికీ కుటుంభాలు ఉన్నాయి. అందుకనే వారందరికీ సమస్యల గురించి తెలుసు” అంటూ అఖిలేష్ ఎద్దేవా చేశారు.
ఇలా ఉండగా, అఖిలేష్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో `గూండా రాజ్’ తిరిగి వస్తుందని, యోగి ఆదిత్యనాథ్ `నేరస్థులు లేని’ పాలన అందించారని ప్రచారాన్ని కూడా అఖిలేష్ తీవ్రంగా ఖండించారు. బిఎజిపి అభ్యర్థులలో సుమారు వంద మంది నేర చరిత్ర ఉన్నవారే అని గుర్తు చేశారు.