తెలంగాణ రాష్ట్రంలో కంటే తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో మంచి పథకాలు ఉంటే రాజీనామా చేస్తానని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీ రామారావు సవాల్ విసిరారు. వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రమేశ్ తో కలిసి రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, అలాంటి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని మంత్రి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కోసం చేసింది ఏమీ లేదని ఆయన స్పష్టం చేసారు. కాశీ అభివృద్ధికి రూ.1000 కోట్లు ఇచ్చామని చెబుతున్న ప్రధాని మోదీ తెలంగాణలోని వేములవాడకు ఎందుకివ్వడంలేదని ఆయన ప్రశ్నించారు.
కాశీలో ఉన్న దేవుడు వేములవాడలో లేడా అని అడిగారు. వేములవాడకు ఎన్ని నిధులు తీసుకొచ్చావని ఎంపీ బండి సంజయ్ ను కేటీఆర్ నిలదీశారు. కల్లబొల్లి మాటలు కాదు.. మాది చేతల ప్రభుత్వం, అడగకుండనే వంద శాతం అభివృద్ధి పనులు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
గతంలో అనేకమంది నాయకులు మాటలతో గడిపారని పేర్కొంటూ ఏడున్నర ఏండ్లలో సిఎం కెసిఆర్ చేసిన ప్రతి పని మన కళ్లముందు కనబడుతుందని ఆయన గుర్తు చేశారు. విమర్శలు చేసిన వారి అడ్రస్ గల్లంతు అయ్యిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు పైసా ఖర్చులేకుండా పారదర్శకంగా డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తమదే అని మంత్రి స్పష్టం చేశారు.