తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మరోసారి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. పైగా, మొదటిగా రాష్ట్ర గవర్నర్ డా. తమిళశై సౌందరరాజన్ వ్యవహారంపై తీవ్ర అసంతృత్తి బహిరంగంగా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలలో ఈ విషయమై తానే స్వయంగా మాట్లాడతానని కూడా ఆదివారం సాయంత్రం బడ్జెట్ ప్రతిపాదనల ఆమోదం కోసం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చెప్పిన్నట్లు తెలుస్తున్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ తడాఖా ఏందో చూపిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంతో కొట్లాడుడేనని తేల్చిచెప్పారు. కూటమి ప్రయత్నాలకు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాల నుంచి మస్తు స్పందన వస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా త్వరలోనే దేశంలోని అన్ని రైతుసంఘాల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.
రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రినే చంపాలని చూస్తే ఊరుకుంటమా అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన పలు హామీలను కేంద్రం అమలు చేయలేదని, వాళ్లతో ఎంత సఖ్యతగా ఉన్నా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై సానుకూలంగా స్పందించనే లేదని కేసీఆర్ మండిపడ్డారు. ఇన్నాళ్లు ఉపేక్షించామని, ఇక ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
కేంద్రం తీరుపై అసెంబ్లీలో చర్చ పెట్టి ఆయా హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేద్దామని ప్రతిపాదించారు. కాగా, అసెంబ్లీ సమావేశాలపై బిజినెస్ రూల్స్‌కు లోబడే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేస్తూ దీనిపై గవర్నర్ తీరు సరిగా లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా రెచ్చిపోవద్దని సహచర మంత్రులకు సూచించారు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ఎవరు పడితే వారు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయొద్దని, ఏ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలో ఇప్పటికే నిర్ణయించామని, వాళ్లు ఇప్పటికే తయారై సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ప్రతిపక్షాలు చెప్పేవన్నీ అబద్ధాలేనని, అసెంబ్లీ వేదికగా వాటిని తేటతెల్లం చేస్తానని పేర్కొన్నారు. తాను పూర్తి సెషన్‌కు హాజరవుతానని, అవసరమైన సందర్భాల్లో తానే స్పందిస్తానని కేసీఆర్ తెలిపారు.దేశంలో తాను ఎక్కడికి పోయినా రాజకీయ పార్టీలు, ఇతర సంఘాల నుంచి మంచి స్పందన వస్తున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ సహా అనేక మంది ప్రోత్సహించారని తెలిపారు. కేంద్రం తీరుపై ఎవరో ఒకరు ముందడుగు వేయాల్సి ఉండెనని వాళ్లు కూడా అన్నారని, తనకు మద్దతుగా నిలుస్తామని చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు.
ఏదైనా పార్టీ కలిసి రాకుంటే ఆయా రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధ్యక్షుల మెడలు రైతు సంఘాల నాయకులు వంచుతారని ఆయన భరోసా వ్యక్తం చేశారు. ‘‘నేను ఏది ప్రారంభించినా ఆగే ప్రసక్తే లేదు.. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిననాడు.. ఇప్పుడు మేం ఉద్యమకారులం అని చెప్పుకునేటోళ్లు అది అయ్యే పనికాదు అన్నరు.. ఇడ్సి పెట్టుమన్నరు.. కానీ ఇడువలే.. పట్టుపట్టి కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చినా.. ఇప్పుడు ఫ్రంట్ కూడా పెట్టి చూపిస్త’’ అని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో కేసీఆర్ పనైపోయినదని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి ఎవ్వరూ పరేషాన్ కావొద్దని కేసీఆర్ చెప్పారు. ‘‘టీవీల్లో ఎవడో ఏదో మాట్లాడుతున్నడని ఆగం కావొద్దు. వాళ్లకు ఎవ్వడు సర్వేలు చేస్తున్నడు. అన్నీ వట్టి డబ్బా ముచ్చట్లే.. నేను నెలకు నాలుగు సర్వేలు చేయిస్తున్న. అన్ని సర్వేల్లో మనం ముందున్నం.. కచ్చితంగా మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే..” అని భరోసా వ్యక్తం చేశారు.
“మీరు మన పథకాలను ప్రజలకు గట్టిగా చెప్పుకోండి. కేంద్రం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. నేను ఉన్న. మళ్లీ గెలుస్తున్నం’’ అని మంత్రులతో చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇకపై ప్రజల్లోనే ఎక్కువ సమయం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.