ఉత్తరప్రదేశ్ మణిపూర్ లలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని, పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వస్తుందని, ఉత్తరాఖండ్ లో పోటీ కీలకంగా ఉన్నదని హైదరాబాద్ కు చెందిన పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది.
యుపిలో బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి 220 నుంచి 240 వరకు సీట్లు సాధిస్తుందని పోస్ట్ పోల్ సర్వే తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని పేర్కొంది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశముంది. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్ఎల్డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా కట్టింది. కాంగ్రెస్ పార్టీ 4 నుంచి 8 స్థానాలకు పరిమితం కానుంది.
పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని అంచనా వేసింది.ఆమ్ ఆద్మీ పార్టీకి 59 నుంచి 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార కాంగ్రెస్ 23 నుంచి 28 స్థానాలు గెలుచుకునే చాన్స్ ఉంది. శిరోమణి అకాలీదళ్‌కు 17 నుంచి 21 సీట్లు, బీజేపీకి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇతరులు ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో పాగా వేయనున్నారు.
కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి సీఎం బీరెన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికార పగ్గాలను చేపట్టనున్నట్లు తేలింది. కాగా మణిపూర్‌లో60 సీట్లకు రెండు విడతల్లో( ఫిబ్రవరి 28, మార్చి 5) పోలింగ్ నిర్వహించారు. మొత్తం 60 సీటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 31 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో బీజేపీ 25 నుంచి 29 స్థానాల వరకు గెలుచుకోనున్నట్లు తేలింది. కాంగ్రెస్ ప్రధాన పత్రిపక్షంగా ఏర్పడనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ 17 నుంచి 21 సీట్లు వరకు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలింది. అదే విధంగా ఎన్పీపీ 7 నుంచి 11, ఎన్పీఎఫ్ 3 నుంచి 5, ఇతరులు 2 నుంచి అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందనున్నట్లు చెబుతున్నాయి.
హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు 32 నుండి 37, బిజెపికి 30 నుండి 35 సీట్లు రావచ్చని సర్వే తెలుపుతుంది. అయితే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత హరీష్ రావత్ కు 40 శాతం మంది, ప్రస్తుత బిజెపి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామికి 37 శాతం మంది మద్దతు తెలిపారు.
యుపిలో బిజెపి 90 సీట్లు కోల్పోయే అవకాశం
గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి బీజేపీ 90 సీట్లు కోల్పోయే అవకాశముందని సర్వేలో వెల్లడైంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీని మరోసారి ప్రతిపక్షంలోనే కూర్చునే అవకాశముంది. అయితే గతంతో పోలిస్తే దాని బలం 300 శాతం వరకు పెరుగుతుందని అంచనా. యూపీ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు హోరాహోరీ తలపడినట్టు కనబడుతున్నా.. క్షేత్రస్థాయిలో చూసుకుంటే బీఎస్పీ కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది.
ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్య్నాధ్పై ఎక్కువ మంది యూపీ ప్రజలు మొగ్గు చూపారు. 38 శాతం మంది యోగి అనుకూలంగా ఉండగా, అఖిలేశ్ యాదవ్ కావాలని 33 శాతం మంది కోరుకున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని సీఎంగా చూడాలని 16 శాతం మంది కోరుకోగా, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి అనుకూలంగా 6 శాతం మంది ఉన్నారు.
తాజా ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్‌ను గద్దె దించే మానసిక స్థితికి ఓటరుకు చేరుకోలేదని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందినవారు సానుకూలత వ్యక్తం కావడం, శాంతిభద్రత పరిరక్షణ, అవినీతి రహిత పాలన పట్ల యూపీ వాసులు సంతృప్తిగా ఉన్నట్టు కనబడుతోంది. మహిళా ఓటర్లు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపారని మరో అంచనా. అయితే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరన్న వాదనలు సీఎం యోగికి కంటగింపుగా మారాయి.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి 59 నుంచి 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార కాంగ్రెస్ 23 నుంచి 28 స్థానాలు గెలుచుకునే చాన్స్ ఉంది. శిరోమణి అకాలీదళ్‌కు 17 నుంచి 21 సీట్లు, బీజేపీకి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇతరులు ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో పాగా వేయనున్నారు.
ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్‌పైపు పంజాబ్ ప్రజలు మొగ్గు చూపారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ రెండో స్థానానికి పడిపోయారు. భగవంత్ మాన్.. ముఖ్యమంత్రి కావాలని 39 శాతం మంది, ఛన్నీ సీఎం కావాలని 30 శాతం మంది కోరుకున్నారు. సుఖ్బీర్ సింగ్ బాదల్‌వైపు 20 శాతం మంది మొగ్గు చూపారు.
ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పంజాబీలు గట్టిషాక్ ఇచ్చారు. కేవలం 6 శాతం మంది మాత్రమే ఆయన సీఎం కావాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను కోరుకునే వారి సంఖ్య 3 శాతం మాత్రమే. వీరెవరూ వద్దని 2 శాతం మంది అభిప్రాయపడ్డారు.