జైలు నుండి విడుదలై వచ్చినప్పటి నుండి అన్నాడీఎంకేపై తిరిగి పూర్తి ఆధిపత్యం సాధించడం ద్వారా తమిళనాడు రాజకీయాలలో మరోసారి చక్రం తిప్పాలని ఆశపడిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళకు అప్పట్లో సాధ్యం కాలేదు. ఆమె జైలుకు వెళ్లిన తర్వాత పార్టీలో కీలక నేతలుగా మారిన నాటి ముఖ్యమంత్రి పళనిసామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఒకటిగా ఉంటూ, ఆమె రాకను తీవ్రంగా అడ్డుకున్నారు. దానితో ఆమె రాజకీయంగా తెరమరుగు కావలసి వచ్చింది. అయితే గత ఏడాది ఎన్నికలలో
అధికారం కోల్పోయినప్పటి నుండి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. పైగా, వరుసగా ఎన్నికలలో ఓటమి చెందుతూ రావడంతో ఈ అగాధం మరింతగా పెరుగుతున్నది. దానితో వారి మధ్య మరింతగా చిచ్చు రాజేయడం ద్వారా, పార్టీని హస్తగతం చేసుకొనే ఎత్తుగడ ఇప్పుడు శశికళ వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఆమెను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని డిమాండ్లు పార్టీ వర్గాల నుండి తెరపైకి వస్తుండడం కూడా వారి మధ్య అగాధం మరింతగా పెరగడానికి దారితీస్తుంది.
పన్నీర్‌సెల్వంను తన వైపుకు తిప్పుకొనే ప్రయత్నం ఆమె చేస్తున్నారు. ఆయన కూడా ఆమె పట్ల కొంత మెతక వైఖరినే అవలంభిస్తున్నారు. ఆయన ఇటీవల తన సొంత జిల్లా తేనిలోని పెరియకుళం ఫాంహౌస్‌లో తన అనుచరులతో కీలక మంతనాలు జరిపారు. ఇందులో పార్టీలోకి శశికళను తిరిగి తీసుకోవాలంటూ ఒక తీర్మానం కూడా చేశారు. ఇది అన్నాడీఎంకేలో తీవ్ర కలకలం రేపింది.
పార్టీ సమన్వయకర్తగా ఉన్న ఓపీఎస్ సమక్షంలోనే ఈ తీర్మానం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. మరోవంక, గురువారం తిరుచ్చెందూరులో బస చేసిన శశికళను ఓపీఎస్ సోదరుడు రాజా కలుసుకుని, అన్నాడీఎంకేను ముందుండి నడిపించాలంటూ విఙ్ఞప్తి చేశారు. ఈ భేటీ ఓపీఎస్ అనుమతితోనే జరిగినట్టు సర్వత్రా భావిస్తున్నారు.
దీంతో నష్టం జరగకుండా నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిన ఓపీఎస్ పార్టీ ఉపసమన్వయకర్తతో కలిసి పార్టీ నుంచి రాజాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇది కార్యకర్తలను మరింత గందరగోళానికి గురిచేసింది. ఇదిలావుంటే, శశికళతో భేటీ తర్వాత రాజా మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీ ఎంకేను ఓపీఎస్, ఈపీఎస్‌లు భూస్థాపితం చేశారని ఆరోపించారు.
మరోవంక, దక్షిణాది జిల్లాలకు చెందిన అనేక మంది పార్టీ నేతలు ఓపీఎస్‌తో వరుసగా సమావేశమవుతున్నారు. తాజాగా జరిగిన ఈ భేటీకి సంబంధించి అధికారపూర్వకంగా ఎక్కడా ప్రకటన చేయలేదు. పైగా, శశికళ, టీటీవీ దినకరన్‌లను తిరిగి పార్టీలో చేర్చుకుంటే ఎదురయ్యే అనుకూల, ప్రతికూల అంశాలను ఓపీఎస్‌కు వారు వివరించినట్టు తెలుస్తున్నది.
అదేవిధంగా ఎడప్పాడి పళనిస్వామి మద్దతు దారులు కూడా మరో సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తున్నది. అన్నాడీఎంకేను నడిపిస్తున్న ఇద్దరు కీలక నేతలకు చెందిన అనుచరులు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తుండంతో దిగువశ్రేణి కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.