తీర రాష్ట్రమైన గోవాలో మరోసారి హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ సూచిస్తుండటంతో కూటమి సర్దుబాట్లలో ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లు ఓట్ల లెక్కింపుకు ముందు నుండే ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే చిన్న పార్టీలు, స్వతంత్రులతో మంతనాలు జరుపుతున్నాయి.
ఈ నేపథ్యంలో తృణమూల్ మిత్రపక్షమైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి) కీలకంగా మారింది. ఆ పార్టీ నేత సుదిన్ ధవలికర్ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే బిజెపి తమను సంప్రదించినట్లు ఎంజిపి తెలిపింది. అయితే ముఖ్యమంత్రి సావంత్‌కి మద్దతు ఇవ్వబోమని ఎంజిపి గతంలోనే ఈ పార్టీ స్పష్టం చేసింది.
గోవాలో 22 సీట్ల కంటే ఎక్కువే సాధిస్తామని, ఒకవేళ మెజార్టీ సాధించలేకపోతే.. స్వతంత్రులు, ఎంజిపి పార్టీ మద్దతు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని సావంత్ వెల్లడించారు. ఇప్పటికే బిజెపి అధిష్టానం ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఎంజిపికి చెందిన ముగ్గురు ఎమ్యెల్యేల మద్దతుతో బిజెపి మెజారిటీ మార్క్ కు చేరుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కాగా, గతంలో బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎంజిపి మనోహర్ పారికర్ మృతి తర్వాత తమ పార్టీకి చెందిన ఇద్దరినీ మంత్రివర్గం నుండి తొలగించడంతో బిజెపికి దూరమైనది. పార్టీ ఈ సారి ఎన్నికలకు ముందే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. దీంతో ఎంజిపి నేతలను బుజ్జగించి.. ఈ సారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి గట్టిగా యత్నిస్తోంది.
గోవా బిజెపి ఇన్చార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ ఎంజిపితో కూటమితో చర్చలు జరుపుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అయితే ప్రమోద్ సావంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోతే ఎంజిపి కూడా బిజెపికి మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
మరోవంక, 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లతో గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపికి 13 సీట్లు మాత్రమే లభించాయి. అప్పట్లో కాంగ్రెస్ లో నలుగురు ముఖ్యమంత్రి పదవి కోసం కుమ్ములాటలకు దిగారు. వారిలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు. దానితో వారిలో ఎవ్వరిని ఎంపిక చేయాలో తెలియక కాంగ్రెస్ సందిగ్దతలో పడింది.
ఈ లోగా, బిజెపి ఎంజిపి, గోవా ఫార్వర్డ్ పార్టీ, స్వతంత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కూడా గోవాలో హంగ్ తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనావేయడంతో .. కాంగ్రెస్ కూడా వేగంగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తమ కూటమికి మెజారిటీ లభించినా మంత్రివర్గంలో ఎంబిజిని కలుపుకొని ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ నేత మైఖేల్ లోబో ప్రకటించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్ నేతలు ఆయా పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం ఏర్పాటుపై టిఎంసితో కలసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకొంటామని ఎంజిపి నేత సుదిన్ ధవలికర్ ప్రకటించారు.
ఇలా ఉండగా, గోవా కాంగ్రెస్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తమ పార్టీ అభ్యర్థుల్ని హోటల్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు హోటల్లోనే ఉంటారు. అక్కడి నుంచి గురువారం నేరుగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
గత అసెంబ్లీ ఫలితాల తర్వాత జరిగిన పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుచుకుంది. అయితే, గెలుపొందినవాళ్లలో ఎక్కువమంది బీజేపీతో చేరిపోవడంతో కాంగ్రెస్ మెజార్టీ రెండుకు పడిపోయింది. దీంతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకునే అవకాశం కోల్పోయింది. అందుకే ఈసారి అలాంటి పొరపాట్లు జరగకూడదని ముందునుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది.