పార్లమెంటు, శాసనసభలతోపాటు అన్ని చట్టసభలు తరచుగా సమావేశమవుతూ నవభారత నిర్మాణానికి అవసరమైన విధంగా నిర్మాణాత్మకమైన బాటలు వేయాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపిచ్చారు. దీనికితోడు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని మరింతగా పెంచడం, ప్రజాప్రయోజనాలతో ముడిపడిన అంశాలపై విస్తృతమైన చర్చలు జరపడం తదితర అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
మిజోరం అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తూ శాసనసభ సమావేశాలను సరైన సమయంలో నిర్వహిస్తూ, సరైన అంశాలపై చర్చోపచర్చలు నిర్వహించాలని చెప్పారు. ప్రతి సమావేశం తర్వాత నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లాలని పేర్కొన్నారు.
దేశ స్వాతంత్యానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటూనే.. ఈ సందర్భంగా మన ఘనమైన ప్రజాస్వామ్య వారసత్వాన్ని మరింత బాద్యతగా ముందుకు తీసుకెళ్లేందుకు మహాసంకల్పాన్ని తీసుకోవాలని సూచించారు. నవభారత నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ప్రజాప్రతినిధి ఆలోచించాలని చెబుతూ ఈ దిశగా పునరంకితం కావాలని కోరారు.
చట్టసభల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంఖ్య మరీ తక్కువగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ఈ సంఖ్యను పెంచడం ద్వారా నిర్మాణాత్మక నిర్ణయాలను తీసుకునే విషయంలో వారినీ భాగస్వాములు చేయాల్సిన తక్షణావసరం ఉందని చెప్పారు.
మిజోరం అసెంబ్లీ 50వ వార్షికోత్సవం సందర్భంగా సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి, దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంలో మిజోరం అసెంబ్లీ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ప్రత్యేక సందర్భమని పేర్కొన్నారు. ఆగ్నేయాసియా ఆర్థిక వ్యవస్థలకు మిజోరం రాచబాట వేస్తుందని ఆయన చెప్పారు.
శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటుచేసుకోవడంలో ఐదు దశాబ్దాలుగా మిజోరం తీసుకుంటున్న చర్యలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. మిజోరం శాంతి ఒప్పందం దీనికి ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు.
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు జరుగుతున్న పురోగతిని కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు. వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాల్లోనూ విశిష్టమైన కృషి జరుగుతోందని కొనియాడుతూ ఇదే అంకితభావాన్ని ఇకపైనా కొనసాగించాలని శాసనసభకు ఉపరాష్ట్రపతి సూచించారు.
మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి జోరంతుంగ, స్పీకర్ లార్లిన్ లియానా సైలో తదితరులు పాల్గొన్నారు.