పంజాబ్‌లో అనూహ్య విజయం సాధించిన సంబరాలలో ఉన్న ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వ్యాపించి, జాతీయ పార్టీగా ఎదగడం కోసం ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నది. గతంలోనే దేశవ్యాప్తంగా పార్టీ విభాగాలు ఏర్పాటు చేసి, ఎన్నికలలో పోటీ చేసినా ఢిల్లీ, పంజాబ్ లలో మినహా ఎక్కడ ప్రభావం చూపలేక పోయింది.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ చతికలపడటంతో ఆ స్థానం ఆక్రమించడం కోసం వ్యూహాత్మకంగా సొంతంగా ఎదగాలని అడుగులు వేస్తున్నది. ఇతర పార్టీలతో పొత్తులకు సిద్దపడటం లేదు. అందుకనే పంజాబ్ లో ఆ పార్టీ అఖండ విజయం సాధించినా ప్రత్యర్ధులైన ప్రధాని, కాంగ్రెస్ నేతలు అభినందించారు గాని ప్రతిపక్ష నేతలైన మమతా బెనర్జీ, కేసీఆర్, ఎంకే స్టాలిన్ వంటి వారెవ్వరూ అభినందిస్తూ ట్వీట్ కూడా ఇవ్వలేదు. కనీసం కేరళ సీఎం విజయన్ కూడా ఆభినందించలేదు.
మొదటగా డిసెంబర్ లో ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లపై ద్రుష్టి సారించిన, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి ఉద్యమంకు ఈ రాష్ట్రాలలో అపూర్వ మద్దతు లభిచినా ఆప్ చెప్పుకోదగిన పట్టు సాధించలేక పోయింది.
ఇప్పుడు మరోసారి, దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ పటిష్టత దిశలో చర్యలకు దిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో పార్టీ తరఫున సభ్యత్వ సేకరణ జరుగుతుందని ఆప్ సీనియర్ నేత సోమనాధ్ భారతీ తెలిపారు.
ఢిల్లీ తరువాత పంజాబ్‌లో అధికారం దిశలో దూసుకువెళ్లిన ఆప్ పట్ల దక్షిణాది ప్రజల నుంచి మరింతగా అభిమానం వ్యక్తం అవుతోందని, దీనిని గమనించి తాము ఇప్పుడు ఆయా రాష్ట్రాల ప్రజల వద్దకు వెళ్లుతామని ఆప్ నేత తెలిపారు. ముందుగా అంతటా సభ్యత్వ నమోదు సేకరణ ప్రక్రియ ముమ్మరం చేస్తామని తెలిపారు.
దేశ రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకునే వారు ఎవరైనా ఆప్‌లో చేరవచ్చునని భారతీ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలలో దశలవారిగా ఆప్ తరఫున పాదయాత్రలు ఉంటాయని, తెలంగాణలో ఎప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆప్ పాదయాత్ర చేపడుతారని చెప్పారు. పాదయాత్రల సందర్భంగా తమ పార్టీ ఆశయాలను ప్రజలకు తెలియచేస్తామని ఆప్ నేత వివరించారు.
ఇప్పటికే తెలంగాణ ఎపిలతో పాటు పలు దక్షిణాది రాష్ట్రాలలో తమ పార్టీ శాఖలు ఉన్నాయని, వీటి ద్వారా తాము మౌలిక పరిస్థితిని ఆకళింపు చేసుకుంటున్నామని తెలిపారు. ఢిల్లీలో ఆప్ ప్రజల జీవితాలలో మార్పులు తీసుకువచ్చిందని, ఇతర రాష్ట్రాలలో పాలనతో తమ పార్టీ పాలనకు ఉన్న తేడాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు.