ఐదు రాష్ట్రాలలో ఘోర పరాజయం అనంతరం ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ సమావేశంలో పార్టీ దిద్దుబాటు చర్యలు చేబడుతుందని ఆశించిన వారికి ఆశాభంగం కలిగింది. కనీసం పరాజయంకు నాయకత్వమే కారణమని అంటూ పలువురు సీనియర్ నాయకులు వరుసగా ఇచ్చిన ప్రకటనల గురించి చర్చిస్తారని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. నిరాశాజనకంగా ఫలితాలు రావడానికి తమ వ్యూహంలో లోపమే కారణం అంటూ సర్దిచెప్పుకొంది.
చివరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోనియా గాంధీ నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆమెతో పాటు, ఆమె కుటుంభ సభ్యులు (రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) రాజీనామా చేయబోతున్నట్లు వచ్చిన మీడియా కథనాలను కొట్టిపారవేస్తూ, ఎవ్వరు రాజీనామా చేయడం లేదని స్పష్టం చేసింది.
సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధినేతగా మరింత కాలం సోనియా గాంధీనే కొనసాగుతారు. మాకందరికీ నాయకత్వం వహించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటారు. ఆమె నాయకత్వంపై పార్టీలో అంతటి నమ్మకం ఉంది. అందుకే పార్టీనేతలంతా సోనియా గాంధీకే మొగ్గు చూపారు’’ అని తెలిపారు.
ఎన్నికల ఫలితాలపైననే ప్రధానంగా చర్చించినట్లు పేర్కొంటూ . ప్రతిపక్ష హోదాను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తాని పేర్కొమన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్టు తెలిపారు. సోనియా గాంధీ అధ్యక్షత వహించారు. పార్టీ సీనియర్ నేతలు గులం నబీ ఆజాద్, చిదంబరం, మల్లికార్జున ఖర్గే, అంబికా సోనీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
“ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. మా వ్యూహం లోపించడం వల్లే నాలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల దుష్పరిపాలనను సమర్థవంతంగా బయటపెట్టలేకపోయాం. పంజాబ్ లో నాయకత్వ మార్పు తర్వాత తక్కువ సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతను అదుపు చేయలేకపోయాం” అంటూ భేటీ అనంతరం విడుదల చేసిన ప్రకటనలు పేర్కొన్నారు.
దేశంలో కొనసాగుతున్న రాజకీయ నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా కోట్లాది మంది భారతీయుల ఆశలకు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోందని స్పష్టం చేసారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల కోసం అవిశ్రాంతంగా పనిచేసిన లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రజాభిప్రాయాన్ని వినమ్రతతో అంగీకరిస్తూ, అప్రమత్తమైన శక్తివంతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కాంగ్రెస్ పార్టీ తన కార్యకర్తలకు దేశ ప్రజలకు హామీ ఇచ్చింది.
భవిష్యత్లో 2022, 2023 ఎన్నికలు, 2024లో జరిగే లోక్సభ, రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధతతో ఉందని తెలిపింది. సోనియా గాంధీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మాణం చేసింది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే మరోసారి సీడబ్ల్యూసీ సమావేశం జరపాలని, పార్టీ బలోపేతం, రోడ్ మ్యాప్ పై కాంగ్రెస్ పార్టీ సమగ్ర ఆలోచనా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సీడబ్ల్యుూసీ నిర్ణయించింది.