పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతంలో 19 మంది మరణానికి కారణమైన కల్తీసారా, కల్తీమద్యం అంశం సోమవారం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది.ఈ అంశంపై చర్చకు టిడిపి సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ అనుమతినివ్వలేదు. దీంతో టిడిపి శాసనసభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. వాయిదా తీర్మాన కాగితాలను చించి ఆయనపైకి విసిరేసారు.
టిడిపి వైఖరిని వైసిపి తప్పుపట్టింది. చర్చ జరపకుండా ప్రతిరోజు టిడిపి సభకు అడ్డుపడుతోందంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టిడిపి సభ్యుల ఆందోళనతో సభ పదే పదే వాయిదా పడింది. దానితో ఐదురుగు సభ్యులను బడ్జెట్ సమావేశాల చివరి వరకు సస్పెండ్ చేశారు.
బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులను సెస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాల చివరి వరకూ వీరిపై సస్పెన్షన్ విధించారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలని హితవు చెప్పారు.
సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారంపై ఆయన అసెంబ్లీలో స్పందిస్తూ సహజ మరణాలపై టీడీపీ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు.
మరోవంక, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాల పరామర్శకు జంగారెడ్డిగూడెం బయలుదేరి వెళ్లారు. ఒకొక్క కుటుంభంకు రూ 1 లక్ష చొప్పున పార్టీ తరపున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం రూ 25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ప్రభుత్వం వచ్చాక అందిస్తామని తెలిపారు.
బడ్జెట్ సమావేశాల్లో అయిదవ రోజు సోమవారం సభ ప్రారంభంతోనే టిడిపి సభ్యులు నినాదాలు చేస్తూ, వాయిదా తీర్మానంపై చర్చకు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారాకు 18 మంది బలయ్యారని ఆరోపిస్తూ చర్చకు పట్టుబట్టి సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
స్పీకర్ పోడియంను కూడా చుట్టుముట్టడంతో సభను స్పీకర్ కాసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టిడిపి ఆందోళన చేపట్టి సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో ప్రశ్నోత్తరాలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది.
కాగా, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ మద్య నిషేధం అమలు చేస్తే, దానికి తూట్లు పొడిచిన చంద్రబాబు, తన పాలనలో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు పెంచారని ధ్వజమెత్తారు. ఎక్కడపడితే అక్కడ బెల్ట్‌షాప్‌లు ఏర్పాటు చేయించి, మద్యం అమ్మకాలు పెంచి, అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఇవాళ కూడా ఎల్లో మీడియా, ఈనాడు జంగారెడ్డిగూడెం ఘటనను తప్పుదారి పట్టిస్తూ, ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా కథనం రాసిందని ఆరోపించారు. రామోజీరావు ఆ స్థాయికి దిగజారారని, చంద్రబాబు శవ రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న టిడిపి సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ… శవ రాజకీయాలకు టిడిపి పేటెంట్గా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కించపరచాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. ఇంటింటికీ బెల్ట్ షాప్‌లు, పర్మిట్ రూమ్‌లు పెట్టి ఆనాడు దారుణంగా మద్యం అమ్మకాలు కొనసాగించారని ఆరోపించారు. నాడు ఎన్టీఆర్ మద్య నిషేధం అమలు చేస్తే, అధికారంలోకి రాగానే మద్యం కంపెనీలతో కుమ్మక్కై మద్య నిషేధానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు.
మున్సిపల్ శాఖ మంత్రి బత్స సత్యనారాయణ మాట్లాడుతూ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, సభలో గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు స్పీకర్ పోడియం వద్దకు కూడా దూసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు రోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో జంగారెడ్డిగూడెం మరణాల వార్తలు రాస్తూ, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని దాన్ని పట్టుకుని టిడిపి శవ రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.
పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ సభలో టిడిపి చేస్తోంది ఒక డ్రామా అన్ని చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారం వారు ఆ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్దేశం మేరకే సభలో టిడిపి సభ్యులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని నిప్పులు చెరిగారు. సభలో గొడవ చేసి, సస్పెన్షన్‌కు గురై, బయటకు వచ్చి విమర్శలు చేసి, జంగారెడ్డిగూడెం పోవాలని టిడిపి సభ్యులు వ్యూహం పన్నారని ఆరోపించారు