రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని ప్రకటించనని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో టిడిపి, బిజెపి లతో కలసి కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ప్రభుత్వం బిజెపితో నెలకొన్న పొత్తును ప్రస్తావిస్తూ రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుందని వెల్లడించారు.
ఈ దిశగా బీజేపీ నాయకులు రోడ్‌మ్యాప్ ఇస్తామని చెప్పారని, దానికోసం ఎదురు చూస్తానని చెప్పారు. రోడ్ మ్యాప్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, వైసీపీని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేయడం ద్వారా టిడిపితో కలసి కూటమి ఏర్పాటుకు కలసి రావడమో, లేకపోవడమే బిజెపికి వదిలివేస్తున్నట్లు పరోక్షంగా చెప్పిన్నట్లయింది.
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తాడేపల్లి మండలం ఇప్పటం నిర్వహించిన బహిరంభారీ గ సభలో ఆయన మాట్లాడుతూ ‘2024లో అధికారంలోకి వస్తాం. సుపరిపాలన ఇచ్చే కొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తాం’ అంటూ భరోసా వ్యక్తం చేశారు.
‘వైసిపిది విధ్వంసం. మనది వికాసం. వారిది ఆధిపత్యం. జనసేనది ఆత్మగౌరవం. అది అహంకారానికి అడ్డా. ఇది జనసైనికుల గడ్డ’ అని చెప్పారు. తమ సమావేశానికి స్థలం ఇయ్యవద్దంటూ అధికారపార్టీ ఎంత ఒత్తిడి చేసినా స్థానిక రైతులు ధైర్యంగా తమకు సహకరించారని, దానికి కృతజ్ఞతగా ఇప్పటం గ్రామ పంచాయతీకి 50 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నట్లు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు.
‘‘ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ కలిశాయి. ఇప్పుడూ అలాగే వైసీపీ వ్యతిరేక శక్తులు కలవాలి. ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చెబుతున్నా… వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు’’ అని పవన్ తేల్చి చెప్పారు. పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకు రావాలని… అప్పుడు పొత్తుల కోసం ఆలోచిస్తామని ప్రకటించారు.
‘‘ఇన్ని సంవత్సరాలు ప్రజలకు అండగాఉండి భుజంకాచాను. ఇప్పుడు నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా. రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుంది’’ అని పవన్ తన కార్యాచరణను విస్పష్టంగా ప్రకటించడం ద్వారా వచ్చే ఎన్నికలలో పొత్తు కొనసాగాలి అంటే బిజెపి తనను అనుసరించ వలసిందే అని సంకేతం ఇచ్చారు.
వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ ఆదాయం 99,900 కోట్లు. ఆంధ్రా ఆదాయం లక్షా 17వేల కోట్లు. ఈ ఆదాయం ఎటుపోతోంది? ఏం చేస్తున్నారు? తాకట్టులో భారత దేశం అన్నట్లు… ‘అప్పులో ఆంధ్ర’గా మారిపోయిందని ధ్వజమెత్తారు. దాని ప్రభావమే ప్రజలపై పడుతోందని చెప్పారు.
ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు? టీచర్ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? కొత్త నియామకాలు ఎందుకు చేపట్టడం లేదు? ఉద్యోగుల జీతాలు ఎందుకు పెరగడం లేదు? అమ్మఒడి పథకానికి డబ్బులు ఎందుకు ఆగాయి? ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలను ఎందుకు మూసివేస్తున్నారు? ఆరోగ్యశ్రీని ఎందుకు మంచం ఎక్కించారు? ిపింఛన్లు ఎందుకు తగ్గించారు? దీనింతటికీ కారణం… అప్పులు చేయడమే! అంటూ మండిపడ్డారు.
టీడీపీ హయాంలో మద్యంపై 59 వేల కోట్లు ఆదాయం రాగా వైసీపీ రెండున్నరేళ్లలోనే 45వేల కోట్లు సంపాదించిందని గుర్తు చేశారు. ధరలు పెంచితే మద్యం తాగేయడం మానేస్తారని ఓ దరిద్రపు, నీచ, నికృష్ట వాదన వినిపిస్తారని ఎద్దేవా చేశారు. నాసిరకం లిక్కర్ అమ్ముతున్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 12 మంది మరణించారని చెబుతూ అది ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కాదు.. అది ఇడుపులపాయ ఫారిన్ లిక్కర్! రూ 25వేల కోట్ల మద్యం ఆదాయం వారి జేబుల్లోకి చేరుకుందని విమర్శలు కురిపించారు.
వైసీపీ నేతలు పెట్టుబడులను చంపేశారు. ఏపీ అంటే ఎవ్వరూ రావడం లేదు. ఉన్నవాటిని పంపించేస్తున్నారని పవన్ ధ్వజమెత్తారు. అమర్‌రాజా కంపెనీ ఓఉదాహరణ. అనంతపురం జిల్లాలో కియతో రావాల్సిన అనుబంధ పరిశ్రమలు రాలేదని వివరించారు.
‘2024లోఅధికారంలోకి వస్తాం. సుపరిపాలన ఇచ్చే కొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తాం.’ అని ధీమా వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ఆయన తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించారు. షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తామని చెప్పారు. అప్పులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చి దిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించాయిరు. రాష్ట్రానికి మెరుగైన పెట్టుబడులు తీసుకువస్తామని, దీనికోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు.
పెట్టుబడుల కోసం స్నేహ పూరిత విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. విశ్వనగరంగా విశాఖపట్నంను, హైటెక్ సిటీలుగా విజయవాడ, తిరుపతిలను తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్ర రాజధానిగే అమరావతే ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలు నివాసం ఏర్పరుచుకోవడానికి వీలుగా అమరావతిని అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. రాయలసీమను అన్ని విధాల ముందుకు తీసుకుపోతామని, కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతామని చెప్పారు.