హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరికాదని కర్నాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తుదితీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో సాంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. ఈ అంశంపై దాఖలయిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
గత నెల కర్నాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై వివాదం రేగింది. ఉద్రిక్తతల నడుమ హిజాబ్‌కు మద్దతుగాను, వ్యతిరేకంగానూ పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఈ క్రమంలో హిజాబ్ వస్త్రధారణకు అనుమతినివ్వాలని కోరుతూ.. ఉడుపి, కుందాపుర ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు.
కర్ణాటక నుంచి మొదలై దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచంలోనూ హాట్ టాపిక్‌గా మారింది హిజాబ్ వ్యవహారం. విద్యాసంస్థల్లో హిజాబ్‌ను అనుమతించలేదు కర్ణాటక ప్రభుత్వం. ఈ అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
మొదట జస్టిస్ కృష్ణ దీక్షిత్‌తో ఏర్పాటయిన ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై ఫిబ్రవరి 10 న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. 15 రోజుల పాటు వాదనలు కొనసాగాయి. సాంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు కూడా జారీఅయ్యాయి. ఫిబ్రవరి 25 న తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ఉన్నత న్యాయస్థానం ఈరోజు తుది కీలక తీర్పును వెలువరించింది.
కాగా, హిజాబ్ వివాదంపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో.. బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. నేటి నుండి మార్చి 19 వరకు 144 సెక్షన్ విధించారు. ఉడుపిలో నేడు స్కూళ్లు, పాఠశాలలకు సెలవులను ప్రకటించారు.