అప్పులను అప్పుగా చూడొద్దని, వనరుల సమీకరణగా చూడాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూచించారు. .అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా వివరణ ఇస్తూ అప్పుల్లో మన రాష్ట్రం దేశంలో 25వ స్థానంలో ఉందని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా పాటిస్తున్నామని స్పష్టం చేశారు. మనకంటే ఎక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.
మన అప్పుల శాతం 23 శాతమేనని చెబుతూ ప్రస్తుతం భారత దేశ అప్పు రూ 152 లక్షల కోట్లు అని తెలిపారు. బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శించడం సహజమేనని చెబుతూ బడ్జెట్ అంటే అంకెలు మాత్రమే కాదని, బడ్జెట్ అంటే బ్రహ్మపదార్థం అన్నట్లు భావిస్తున్నారని పేర్కొన్నారు.
పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతూ రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం..రాష్ట్రాలను అణిచివేస్తామనే దుర్మార్గ వైఖరితో కేంద్రం ఉందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం ఇష్టమున్నట్లు నిధుల సమీకరణ చేసుకుంటుందని అంటూ రాష్ట్రాలకు ఇచ్చే నీతినే కేంద్రం పాటించాలని స్పష్టం చేశారు. కేంద్రం పనితీరు సరిగ్గా లేదని, మనకంటే అధ్వాన్నంగా ఉన్నదని విమర్శించారు.
నిధుల సమీకరణపై కేంద్రం ఆంక్షలు పెడుతుందని చెబుతూ కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని కేసీఆర్ ధ్వజమెత్తారు. యూపీఏ మీద నిందలు మోపి బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిందని చెబుతూ బీజేపీని నమ్మి ఓటేసినందుకు ప్రజల పరిస్థితి అన్న వస్త్రానికి పోతే.. ఉన్న వస్త్రం పోయినట్లుగా మారిందని కేసీఆర్ దుయ్యబట్టారు.
దేశ ఆర్థిక పరిస్థితి పడిపోవడానికి కరోనా కారణం కాదని, ఎప్పటినుంచో దేశ ఆర్థిక పరిస్థితి పడిపోయిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఐటీ ఎగుమతుల విలువ ఏడాదికి దాదాపు లక్షన్నర కోట్లు కాగా, బెంగళూరు ఐటీ ఎగుమతుల విలువ ఏడాదికి రూ. 3 లక్షల కోట్లని చెప్పారు. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం? అని కేసీఆర్ ప్రశ్నించారు.
మత కలహాలు పెట్టి హిజాబ్ పంచాయితీ పెట్టారని ధ్వజమెత్తారు ఇలాంటి ఆలోచనలు చేస్తే దేశం ఏమవుతుంది? హిజాబ్ లాంటి సమస్యలు ఉంటే దేశానికి పారిశ్రామికవేత్తలు వస్తారా? ఇలాంటి వివాదాలు దేశ యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని హెచ్చరించారు కేంద్ర తీరును అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలని పిలుపిచ్చారు.