ఇప్పటి వరకు కాంగ్రెస్ లో నాయకత్వంలో సంస్కరణలు అంటూ పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తున్న జి-23 నేతలు కేవలం రాహుల్ గాంధీ నాయకత్వంపైననే అసమ్మతి వ్యక్తం చేస్తుండగా, మొదటిసారిగా మొత్తం గాంధీ కుటుంభం నాయకత్వం నుండి తప్పుకొంటేనే పార్టీకి రాజకీయంగా మనుగడ ఉంటుందనే వాఖ్యలు చేయడం ప్రారంభించారు.
పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ మొదటిసారిగా మొత్తం గాంధీ కుటుంబంపై దాడి చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతైనా పార్టీ నాయకత్వ మార్పునకు ‘గాంధీలు’ నడుం బింగించాలని ఆయన పిలుపిచ్చారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా లేరని ఆయన ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టం చేశారు.
ఎన్నో ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊహింని విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రలోనూ సరియైన మెజార్టీతో గెలవలేక పోవడంతో గత ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఐదు గంటల పాటు పెద్ద సమావేశమైనా పార్టీలో కీలక సంస్కరణల గురించి ప్రస్తావించనే లేదు.
ఈ సమావేశంలో పార్టీ సభ్యులు సోనియా గాంధీ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించడంతో యథాతథ స్థితి నుంచి వైదొలగకూడదని నిర్ణయించుకున్నారని కపిల్ సిబల్ పెదవి విరిచారు. గాంధీలు నాయకత్వ పదవుల నుంచి తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. గాంధీలు స్వచ్ఛందంగా వెళ్లిపోతేనే మంచిదని స్పష్టం చేశారు.
ఎందుకంటే వారు నామినేట్ చేసిన పార్టీ సభ్యులు అధికార పగ్గాలను కొనసాగించకూడదని వారికి ఎప్పటికీ చెప్పలేరు అని చెప్పారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కాకపోయినప్పటికీ వాస్తవ అధ్యక్షుడిలా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన విమర్శించారు.
“అంతేకాదు రాహుల్ గాంధీ పంజాబ్ వెళ్లి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. ఆయన ఏ హోదాలో ఈ పని చేశారు? ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు. అన్ని నిర్ణయాలూ ఆయనే తీసుకుంటారు. ఆయన ఇప్పటికే వాస్తవ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయనను తిరిగి అధికార పగ్గాలు చేపట్టాలని అడగడం అర్థం లేని విషయం” అని ఆయన తేల్చి చెప్పారు.
తాను “ఘర్ కీ కాంగ్రెస్”కి విరుద్ధంగా “సబ్ కీ కాంగ్రెస్”ని కోరుకుంటున్నట్లు చెప్పారు. పైగా తన చివరి శ్వాస వరకు ‘సబ్ కీ కాంగ్రెస్’ కోసం పోరాడతానని సిబాల్ స్పష్టం చేశారు. అంతేకాదు కాంగ్రెస్‌లోని చాలామంది నేటి సీడబ్ల్యూసీకి విరుద్ధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని వెల్లడించారు.
సీడబ్ల్యూసీ వెలుపల కాంగ్రెస్ ఉందని దయచేసి మీరు వారి అభిప్రాయాలను వినండి అని విజ్ఞప్తి చేశారు. 2020లో 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్టీలో పెద్ద మార్పులు చేయాలని సోనియా గాంధీకి రాసిన లేఖపై కపిల్ సిబల్ కూడా సంతకం చేశారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ, మరో జి23 సభ్యుడు సందీప్ దీక్షిత్ సిబల్‌కు మద్దతుగా మాట్లాడారు. “పార్టీ పూర్తిగా నిష్క్రియంగా ఉంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. నాయకత్వం అహంకారంతో ఉండగా, ఒకదాని తర్వాత ఒకటిగా ఓడిపోయినా కోటరీపై ప్రభావం పడలేదు… ఈ నాయకుల్లో చాలా మంది కారుణ్య ప్రాతిపదికన పదవులు అనుభవిస్తున్నారు. కేవలం సొంత పదవుల గురించి మాత్రమే చింతిస్తున్నారు” అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను ఉద్దేశించి ఆయన ధ్వజమెత్తారు. .
“కపిల్ సిబల్ సమస్యను లేవనెత్తడం సరైనదే, ఎందుకంటే ఈ నాయకులు ఒక సమయంలో ఓట్లను సంపాదించవచ్చు. అయితే ఇప్పుడు పార్టీ సీరియస్ గా లేదు. ఈ పరాజయానికి బాధ్యులెవరు?” అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. “ఈ కమిటీలు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు లాంటివి. వీటిలో సంభాషణలు, ఆత్మపరిశీలనలు లేవు’’ అని దీక్షిత్ ఎద్దేవా చేశారు.
ఇలా ఉండగా, పార్టీ కేంద్ర నాయకత్వంలో మార్పు కోసం పట్టుబడుతుండగా, ఇటీవల ఎన్నికలు జరిగి పార్టీ ఓటమి పాలైన 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసారు.