దేశంలోని ఎన్నికల ప్రక్రియలో క్రమపద్ధతిలో వ్యూహాత్మకంగా ప్రపంచ సామాజిక మాధ్యమం జోక్యం చేసుకొంటోందని, వ్యవస్థను ప్రభావితం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఫేస్బుక్ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆమె తెలిపారు. బుధవారం ఆమె లోక్‌సభ జీరోఅవర్‌లో మాట్లాడుతూ భారత రాజకీయాలు, ఎన్నికల్లో ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల జోక్యాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
లేకపోతే ఇది ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ సోషల్ మీడియా కంపెనీలను కావాలనే దురుద్ధేశపూరితంగా వాడుకుంటుని ఆమె ధ్వజమెత్తారు. దీనితో దేశ ప్రజాస్వామ్య హరణం జరుగుతోందని ఆమె హెచ్చరించారు. సోషల్ మీడియా ఇక్కడి ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల వ్యవస్థను హ్యాక్ చేస్తోందని, ఇది చొరబాటుతో కూడిన ప్రాబల్యపు చర్య అవుతోందని ఆమె చెప్పారు.
ఫేస్బుక్, ట్విట్టర్ వంటి గ్లోబల్ కంపెనీలను కొన్ని శక్తులు విరివిగా వాడుకుంటున్నాయని సోనియా ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలు, పార్టీలు, తమ అనుకూల పరోక్ష వ్యక్తులు తమ వాదనను బలోపేతం చేసేందుకు వాడుకుంటున్నాయని ఆమవిమర్శించారు. గ్లోబల్ మీడియా కంపెనీలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆమె ధ్వజమెత్తారు.
ఈ మీడియా అన్ని రాజకీయ పార్టీలకు సమాన రీతిలో ప్రాధాన్యత నివ్వకుండా, కొన్ని అభిప్రాయాలను నాటుకుపొయ్యేలా చేసేలా వ్యవహరిస్తున్నాయని సోనియా తెలిపారు. ఇది చివరికి ప్రజాస్వామ్యంపై దాడికి దారితీస్తోందని ఆమె హెచ్చరించారు. కీలక వ్యవస్థలను ప్రభావితం చేసేలా మారుతోందని చెబుతూ ఈ సందర్భంగా ఆమె అల్ జజీరా, రిపోర్టర్స్ కలెక్టివ్లలో వచ్చిన వార్తలను ఆమె ప్రస్తావించారు.
ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే తక్కువ రేట్ల ఈ మీడియా బిజెపికి యాడ్ రేట్లకు దిగుతోందని ఈ వార్తలలో ఉందని ఆమె చెప్పారు. ప్రముఖ కార్పొరేట్లకు, అధికారంలో ఉన్న పార్టీకి, ఈ గ్లోబల్ మీడియాకు మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం దాని వల్ల జరిగే దుష్పలితాలు కన్పిస్తున్నాయని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియా అన్ని రాజకీయ పార్టీలకు తగు సమాన అవకాశం కల్పించాల్సి ఉందని ఆమె స్పష్టం చేశారు.
చీకటి ముసుగులో వ్యవహారాలు సాగుతున్నాయని ఆమె సోనియా విమర్శించారు. సోషల్ మీడియా ప్రచారం తీవ్రస్థాయికి చేరుకొంటోందని చెబుతూ ఇందులోని భావజాలం క్రమేపీ అటు యువ, ఇటు పాత తరం వారి మనసులలో విద్వేషబీజాలను నాటుతోందని, భావోద్వేగ కారక తప్పుడు సమాచారంతో గతి తప్పుతున్నాయని ఆమె మండిపడ్డాయిరు.
ప్రాబల్యపు రాజకీయ పార్టీల తరఫున పలు యాడ్స్‌తో లాభాలు దక్కించుకుంటున్నాయని ఆమె తెలిపారు. సామాజిక సామరస్యం దెబ్బతినే స్థాయిలో రీతిలో ఈ మాధ్యమం తన పని కానిస్తోంది. ఇది భావజాలంపై జరుగుతోన్న దాడి. అరాచకం అవుతోంది. నిశ్చలంగా ఉండాల్సిన సామరస్యానికి ఈ ధోరణి గండికొడుతోందని సోనియా హెచ్చరించారు.
ఫేస్బుక్ ఇతర మాధ్యమాలు ప్రపంచస్థాయిలో ఎన్నికల రాజకీయాలపై జోక్యం చివరికి ప్రభావిత అంశానికి దారితీసి చేటును కల్గిస్తోందని ఆమె పేర్కొన్నారు. వాటి ద్వారా ప్రజాస్వామ్యానికి హాని కల్గుతోందని చెబుతూ అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలలో ఈ పరిణామం ఉందని తెలిపారు.
పక్షపాత రాజకీయాల దశ కూడా దాటిందని చెబుతూ ఇప్పటికైనా మనం ప్రజాస్వామ్యాన్ని, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవల్సి ఉందని ఆమె సూచించారు. అధికారంలో ఎవరు ఉన్నారనేది ముఖ్యం కాదు. ప్రజాస్యామ్య పరిరక్షణ కీలకమని ఆమె చెప్పారు.