ఇటీవల యుపి ఎన్నికల్లో విజయం సాధించడంతో యుపిలో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందంటూ బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకొంటున్న సమయంలో ఆట అప్పుడే అయిపోలేదని అంటూ రాష్ట్రపతి ఎన్నికలు వస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపిని కట్టడి చేయడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నట్లు సంకేతం ఇచ్చారు. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపియేతర కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న మమతా బెనర్జీ ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలతో చర్చలు ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ కన్నా ఎక్కువమంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం పెద్ద విజయం కాదని, రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందడం తేలిక కాదని మమతా స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యలో సగం సభ్యులు కూడా లేని బిజెపి మాట్లాడేందుకు అర్హత లేదని, యుపి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ.. సమాజ్వాది పార్టీ గతంలో కంటే బలంగా పుంజుకుందని ఆమె గుర్తు చేశారు.
ఈ సారి రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గడం బిజెపికి అంత తేలిక కాదని ఆమె ఎద్దేవా చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే జులైలో పూర్తి కానున్నది. ఆ లోపుగా రాష్ట్రపతి ఎన్నికలు జరుగవలసి ఉంది.
రాష్ట్రపతి ఎన్నికలు పరోక్షంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి శాసనసభకి ఎన్నికైన సభ్యులు, పార్లమెంటుకి ఎన్నికైన సభ్యులు ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేల ఓట్ల విలువ 1971లో రాష్ట్ర జనాభా ఆధారంగా లెక్కించబడుతుంది. 1971 నాటి మొత్తం జనాభాను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యతో భాగిస్తారు.
గత ఎన్నికలలో మద్దతు ఇచ్చిన అకాలీదళ్, శివసేన వంటి పార్టీలు బిజెపికి దూరం కాగా, తమిళనాడులో అన్నాడీఎంకే అధికారం కోల్పోయింది. గత పర్యాయం రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపికి మద్దతు ఇచ్చిన టి ఆర్ ఎస్ తో ఇప్పుడు సఖ్యత చెడిపోయింది. బీహార్ లో సహితం ఎన్డీయే ఎమ్యెల్యేల సంఖ్య తగ్గింది. కేవలం పశ్చిమ బెంగాల్ లో మాత్రమే ఎమ్యెల్యేలు, ఎంపీల సంఖ్య పెరిగింది.
ఇప్పటికే బిజెపి నాయకత్వం రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు కూడదీసుకోవడం కోసం తటస్థంగా ఉన్న పలు పార్టీలతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. ఎన్డీయేలో లేని వైసిపి, బిజెడి వంటి పార్టీల మద్దతు కూడదీసుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఈ పార్టీలు గతసారి బిజెపి అభ్యర్ధికి మద్దతు ఇచ్చాయి.